YSRCP leader Sajjala Ramakrishna Reddy : తాడేపల్లి: వ్యవస్థలను మేనేజ్ చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆరితేరిన వ్యక్తి అని, జూన్ 4న ఓట్ల లెక్కింపు రోజున కుట్ర జరిగే అవకాశం ఉందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్ని కుట్రలు, అక్రమాలు చేసైనా గెలిచేందుకు కూటమి నేతలు ప్రయత్నిస్తారని సజ్జల ఆరోపించారు. అందుకే వైసీపీ నేతలు, పోలింగ్ ఏజెంట్స్ కౌంటింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కూటమి నేతలు కుట్రలకు తెరతీసినా, ధైర్యంగా పోరాడాలి కానీ సంయమనం కోల్పోవద్దని సజ్జల వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు.


వైసీపీ ఏజెంట్లతో సజ్జల జూమ్ మీటింగ్  
జూన్ 4న కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం నుంచి జూమ్‌ మీటింగ్‌లో సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. రూల్స్ ప్రకారం వైసీపీకి పడిన ప్రతిఓటు మనకు వచ్చేలా చూడాలి. కౌంటింగ్ సమయంలో కూటమి నేతలు, కార్యకర్తలు కుట్రలకు వెనుకాడరు. అయినా సంయమనంగా ఉండి, ఏదైనా తప్పు జరిగినట్లు గుర్తిస్తే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకూ కౌంటింగ్ కేంద్రంలో అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే కుట్రలు, అక్రమాలు చేసైనా కూటమి గెలుస్తుందని’ సజ్జల సంచలన ఆరోపణలు చేశారు.


పోస్టల్ బ్యాలెట్‌పై ఏమైనా అనుమానుం వస్తే కచ్చితంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, ఇంకా అవసరమైతే పార్టీ అధిష్టానానికి సమాచారం ఇవ్వాలని పార్టీ ఏజెంట్లకు సూచించారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా వైసీపీ గెలుస్తుందని, వరుసగా రెండోసారి జగన్ ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలలో స్థానికంగా ప్రముఖ సర్వే సంస్థలన్నీ ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ గెలిచే అవకాశం ఉందని వెల్లడించాయి. కానీ రాష్ట్రం గురించి అవగాహనా లేని కొన్ని నేషనల్‌ మీడియా సర్వే సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తే నవ్వొస్తుందన్నారు. ఒడిశాలో బీజేడీకి 0 సీట్లు ఇచ్చారు, తమిళనాడులో 9 సీట్లలో పోటీ చేస్తే 14 చోట్ల గెలుస్తుందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇలా పలు రాష్ట్రాల్లో బీజేపీకి అనుకూలమైన ఫలితాలు ఇచ్చినట్లు ప్రజలు గుర్తించారన్నారు. 


అన్ని పార్టీలు కలవడంతో భారీ సౌండ్ వచ్చింది!
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చలు జరిపి బీజేపీ పంచన చేరారు. అంతా ఏకమై సీఎం జగన్‌ను ఓడించాలని గట్టిగా ప్రయత్నాలు చేశారని, అయినా మేం పేదల కోసం పని చేసినట్లు పేర్కొన్నారు. అన్ని పార్టీలు ఏకం కావడంతో సౌండ్ పెద్దగా వచ్చింది. దాంతో ఎన్నికల కమిషన్ పై సైతం ఒత్తిడి పెంచి రాష్ట్రంలో మార్పులు చేర్పులు జరిగాయా అని అనుమానాలు కలిగినట్లు చెప్పారు. పోస్టల్ బ్యాలెట్లపై ఆఖరికి సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయం కోసం పోరాడతామన్నారు. అన్ని పార్టీలు కలవడంతో కౌంటింగ్ పై ఏమైనా ప్రభావం చూపిస్తుందేమోనని అనుమానాలు వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం.. ఫీల్డ్ లో వచ్చిన ఫలితాల కంటే జూన్ 4న ఓట్ల లెక్కింపులో వైసీపీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి ఓటు వేసేందుకు వచ్చినవారు ఏపీలో జరిగిన అభివృద్ధిని గమనించి ఓటు వేయడం శుభపరిణామం. ప్రజల తీర్పు ఈవీఎంలో ఉంది, కౌంటింగ్ లో భారీ మెజార్టీతో వైసీపీ అఖండ విజయం సాధించే ఛాన్స్ ఉందన్నారు.