YSRCP Controversial Comments: అమరావతి మహిళా రైతుల విషయంలో ఓ టీవీ చానల్ లో డిబేట్‌లో పాల్గొన్న వ్యక్తి చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగింది. అక్కడ ఉన్న వారంతా వేశ్యలని.. వేశ్యల రాజధాని అమరావతి అని కృష్ణంరాజు అనే వ్యక్తి చెప్పారు. ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జర్నలిస్టు కూడా ఏకీభవించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

మహిళల్ని అత్యంత ఘోరంగా అవమానించారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ టీవీ చానల్ వైసీపీ అధినేత జగన్ కుటుంబానికి చెందినది కావడంతో కావాలనే అలాంటి మాటలు చెప్పించారని ఆరోపిస్తున్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు అలాగే మాట్లాడేవారని అంటున్నారు.  

ఈ అంశంపై నారా లోకేష్ కూడా స్పందించారు. మహిళల్ని అవమానించిన వారు కాలగర్భంలో కలసిపోవడం ఖాయమని చెప్పాలన్నారు. మహిళాలోకానికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత కుటుంబానికిచెందిన చానల్ లో ఈ వ్యాఖ్యలు చేయడం, అమరావతిపై వైఎస్ఆర్‌సీపీ ఇంకా వ్యతిరేకత వ్యక్తం చేస్తూండటంతో ఉద్దేశపూర్వకంగానే  దాడి చేస్తున్నారని అమరావతి రైతులు అంటున్నారు.   ఈ వ్యవహారంపై పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదు అవుతున్నాయి. కేసులు నమోదు చేసి..  ఆ వ్యాఖ్యలు చేసిన వారిని, వ్యాఖ్యతను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.  

ఈ వివాదంపై వైఎస్ఆర్‌సీపీ,  లేదా ఆ చానల్ ఇంకా బహిరంగంగా స్పందించలేదు. ఆ వ్యాఖ్యలు అనుచితం అని కూడా చెప్పలేదు. దాంతో రాజకీయ దుమారం మరింతగా పెరుగుతోంది.