Andhra Hihgcourt YSRCP :  ఆంధ్రప్రదేశ్ లో ఇరవై ఆరు జిల్లాల్లో నిర్మించిన వైఎస్ఆర్‌సీపీ ఆఫీసులను కూల్చివేసే ప్రయత్నంలో ఉన్నారని కూల్చివేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని వైసీపీ నేతలు ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కూల్చివేతకు రంగం సిద్ధం చేశారన్న సమాచారం తమకు ఉందని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ఈ అంశంపై తనకు ప్రభుత్వం ఇంకా సమాచారం రాలేదని.. ప్రభుత్వం నుంచి సమాచారం తీసుకుని కోర్టుకు తెలియచేస్తామని ప్రభుత్వం తరపు లాయర్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికిప్పుడు వైసీపీ ఆఫీసుల్ని కూల్చి వేయడం లేదని కోర్టుకు తెలిపారు. అనుమతుల్లేకుండా నిర్మించినందున నోటీసులు మాత్రమే ఇచ్చారని తెలిపారు. వాదనల తర్వాత కేసు విచారణను గురువారానికి వాయిదా వేసిన హైకోర్టు స్టేటస్ కో పాటించాలని ఆదేశించింది. 


ఆంధ్రప్రదేశ్‌లో పదమూడు జిల్లాలను వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై ఆరు జిల్లాలుగా మార్చారు. ఆ తర్వాత అన్ని జిల్లాల్లో పార్టీ ఆఫీసులు నిర్మించుకోవడానికి ప్రభుత్వ స్థలాలను కేటాయింప చేసుకున్నారు. ఏడాదికి రూ.వెయ్యి చొప్పున ముఫ్పై మూడేళ్లకు వైసీపీకి లీజుకు ఇచ్చారు. సగటున ఒక్కో పార్టీ ఆఫీసుకు రెండు ఎకరాలు కేటాయించారు. వాటిలో నిర్మాణాలు ప్రారంభించారు. అయితే ఒక్క ఒంగోలులో మినహా మరే పార్టీ ఆఫీసు కార్యాలయ నిర్మాణం కోసం అనుమతులు తీసుకోలేదు. చాలా చోట్ల దరఖాస్తులు కూడా చేయలేదు. ఈ విషయం వైసీపీ అధికారంలో ఉన్నంత వరకూ బయటకు రాలేదు. తామే అధికారంలో ఉన్నాం కదా ఎవరు అడుగుతారన్న విషయాన్ని పట్టించుకోలేదు. అయితే వైసీపీ ఓడిపోవడంతో వెంటనే ఈ పార్టీ కార్యాలయాల అంశం వెలుగులోకి వచ్చింది. 


వేటికీ అనుమతులు లేవని తేలడంతో ఆయా మున్సిపాలిటీలు నోటీసులు ఇవ్వడం ప్రారంభించారు నోటీసులు తీసుకునేవారు లేకపోతే.. ఆయా కార్యాలయాలకు అంటించారు. విశాఖథ సహా పలు జిల్లాల వైసీపీ కార్యాలయాలకు నోటీసులు ఇచ్చారు. వారం రోజుల గడువు ఇచ్చారు. వారం రోజుల్లో అనుమతుల వివరాలు సమర్పించాలని ఆదేశించారు. అనుమతులు తీసుకోకపోతే కూల్చివేస్తామని హెచ్చరించారు. అనుమతులు లేకపోవడంతో ఇక ప్రభుత్వం కూల్చి వేస్తుందన్న అభిప్రాయానికి వచ్చారు. ఇలా నోటీసులు అందిన పార్టీ కార్యాలయాలు కొన్ని దాదాపుగా పూర్తయ్యే పరిస్థితుల్లో ఉన్నాయి. 


కొద్ది రోజులు కిందట గుంటూరు జిల్లా కార్యాలయాన్ని సీఆర్డీఏ అధికారులు కూల్చివేశారు. అయితే అక్కడ ఆఫీసు నిర్మాణం అంత ఎక్కువగా జరగలేదు. కేవలం ఒక్క ఫ్లోర్ కు మాత్రం శ్లామ్ వేశారు. అందుకే రెండు గంటల్లో కూల్చేశారు. ఆ భవనం కూల్చేస్తారని తెలియడంతో హైకోర్టును ఆశ్రయించినా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని హైకోర్టు చెప్పడంతో.. కూల్చివేశారు. ఆ భవనానికీ అనుమతులు లేవు. అందుకే ఇప్పుడు ఇతర భవనాలు కూడా కూల్చేస్తారన్న భయంతో హైకర్టును ఆశ్రయించారు. అయితే అక్రమ కట్టడాలను కూల్చేయవద్దని న్యాయస్థానం కూడా చెప్పదని రేపోమాపో వైసీపీకి వ్యతిరేకంగా తీర్పు వచ్చిన తర్వాత అధికారవర్గాలు చర్యలు తీసుకుంటాయని టీడీపీ నేతలు చెబుతున్నారు.