వివేకా హత్య కేసులో అనుమానుతుడిగా భావిస్తున్న సునీల్ ను పులివెందుల కోర్టులో  హాజరుపరిచారు. గోవాలో సీబీఐ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. అక్కడి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ద్వారా ట్రాన్సిట్‌ రిమాండ్‌లోకి తీసుకుని.. అక్కడి నుంచి బెంగళూరు మీదుగా ప్రత్యేక వాహనంలో కడపకు తరలించారు. కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో నిన్న సునీల్‌ యాదవ్‌ను అధికారులు ప్రశ్నించారు. బుధవారం పులివెందుల కోర్టులో హాజరుపరిచారు.


హత్య కేసులో అనుమానితుడైన సునీల్ యాదవ్ రిమాండ్ రిపోర్ట్​ అంశాలను సీబీఐ తెలిపింది. వివేకా హత్య కేసులో సునీల్ పాత్రపై ఆధారాలు లభించాయని సీబీఐ ​వెల్లడించింది. హత్య కేసులో ప్రమేయంపై సెక్షన్ 164 కింద వాచ్‌మెన్ రంగన్న వాంగ్మూలాన్ని రికార్డ్ చేసినట్లు వివరించింది. విచారణ చేయాలనుకుంటే.. విచారణకు హాజరు కాకుండా పారిపోయాడని సీబీఐ తెలిపింది. అయితే వివేకా హత్య కేసులో సునీల్  యాదవ్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మరోవైపు సునీల్ ను కస్టడీకి ఇవ్వాలంటూ.. సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది.


 


వివేకా హత్య కేసులో తమను సీబీఐ ఇబ్బందులకు గురిచేస్తోందని.. సునీల్ యాదవ్, అతడి కుటుంబ సభ్యులు, మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్ వేశారు. సీబీఐ అధికారులు ఢిల్లీలో థర్ట్ డిగ్రీ ప్రయోగించారని.. ఎలాంటి అనుమతి లేకుండానే.. లై డిటెక్టర్ వినియోగించారని తెలిపారు. అరెస్టు, తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీబీఐని ఆదేశించాలని పిటిషన్ లో కోరారు.  


పులివెందుల మండలం మోట్నూంతలపల్లి గ్రామానికి చెందిన సునీల్‌ యాదవ్‌ వైసీపీ కార్యకర్త. అతడి తల్లిదండ్రులు సావిత్రి, కృష్ణయ్య యాదవ్. అనంతపురం జిల్లాలోని ఓ లిక్కర్ పరిశ్రమలో కృష్ణయ్య పనిచేస్తూ..  అక్కడే ఉండేవాడు. కొన్ని రోజులపాటు ఆటోమెుబైల్ ఫైనాన్స్ సంస్థలో పని చేశారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవడంతో 2017లో పులివెందులకు వచ్చారు.


 
భాకరాపురంలోని అద్దె ఇంట్లో ఉండేవారు. వైసీపీ ప్రభుత్వం... అధికారంలోకి వచ్చాక.. ఇసుక రీచ్ లో పని చేశాడు సునీల్. కొన్ని రోజుల తర్వాత.. ఎర్రగంగిరెడ్డి, దస్తగిరి ద్వారా వివేకాకు సునీల్ యాదవ్ పరిచయమయ్యాడు. అప్పటి నుంచి తరచూ వివేకా ఇంటికి వెళ్లేవాడు. వారి నడుమ ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు సమాచారం.


వివేకా హత్య కేసు విచారణలో భాగంగా సునీల్‌, ఆయన కుటుంబ సభ్యులను సీబీఐ అధికారులు పలుమార్లు విచారించారు. వాచ్‌మన్‌ రంగయ్యను చాలా సార్లు విచారించాక గత నెల 23న జమ్మలమడుగు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు ఎదుట హజరు పరిచి వాంగ్మూలం ఇప్పించారు. 


వివేకా 2019 మార్చి 14న అర్ధరాత్రి తన ఇంట్లో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. వివేకా కుమార్తె సునీత అభ్యర్థన మేరకు హైకోర్టు  మార్చి 11న సీబీఐకి దర్యాప్తు బాధ్యతలు అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అదే ఏడాది జూలై 18న దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. పలువురు దర్యాప్తు అధికారులు కరోనా బారినపడడంతో విచారణకు విరామం ఇచ్చారు. ఈ జూన్‌లో రెండో విడత దర్యాప్తు మొదలుపెట్టారు. 40 మందికిపైగా అనుమానితులను విచారించారు. సీబీఐ విచారణ 59వ రోజుకు చేరింది.