YS Sunitha will make a key announcement on the election contest on the 15th :   వచ్చే ఎన్నికల్లో కడప నుంచి రసవత్తర రాజకీయం ఖాయంగా కనిపిస్తోంది. వైఎస్ సునీత తన రాజకీయ ప్రకటన చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వైఎస్ వివేకా వర్థంతి ఈ నెల పదిహేనో తేదీన కుటుంబసభ్యులు, ఆత్మీయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. పులివెందులలో సమావేశం ఏర్పాటు చేయాలనుకున్నా.. ఫంక్షన్ హాల్ విషయంలో ఇబ్బందులు ఎదురు కావడంతో కడపకు మార్చుకున్నారు. పదిహేనో తేదీన కడపలో  కుటుంబసభ్యులు.. ఆత్మీయులతో సమావేశం నిర్వహించిన తర్వాత ఎన్నికల్లో పోటీపై సునీత కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. 


ఇటీవల ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించిన సునీత తనకు ప్రజా మద్దతు కావాలని కోరారు. ప్రజా తీర్పు కావాలన్నారు. ఇందు కోసం ప్రజల్లోకి వెళ్లాలనుకుంటున్నానని ఏ రూపంలో వెళ్లాలనేది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. అయితే ఇప్పుడు ఎన్నికల్లో పోటీకి నిర్ణయం తీసుకున్నట్లుగా భావిస్తున్నారు. పులివెందుల అసెంబ్లీకా పార్లమెంట్ కా అన్నదానిపై స్పష్టతకు వచ్చారని పదిహేనో తేదీన ప్రకటిస్తారని భావిస్తున్నారు. పోటీ సునీత చేస్తారా.. ఆమె తల్లి చేస్తారా అన్నది కూడా ఆ రోజే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వైఎస్ సునీత లేదా ఆమె తల్లి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయడానికి అంగీకారం తెలిపే అవకాశం కల్పించేందుకు ఆ పార్టీ రెడీగా ఉందన్న సంకేతాలు వచ్చాయి. అయితే ఓ పార్టీ తరపున పోటీ చేయాలా.. విపక్షాల మద్దతుతో స్వతంత్రంగా పోటీ చేయాలా అన్నదానిపైనా చర్చల జరుపుతున్నారు. 


 అయితే స్వతంత్రంగా పోటీ చేస్తే అన్ని పార్టీల మద్దతు లభిస్తుందని అంచనా వేస్తున్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరినా..ఆ పార్టీ నుంచి పోటీ చేస్తే ఇతర పార్టీలు మద్దతుగా నిలిచే అవకాశాలు ఉండవు. అదే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే… అన్ని పార్టీలు మద్దతు తెలిపే అవకాశాలు ఉంటాయి. ఈ కోణంలోనూ సునీత చర్చలు జరుపుతున్నారు. సునీత ఇంత వరకూ ఎప్పుడూ రాజకీయాల జోలికి రాలేదు. ఎప్పుడూ మీడియా ముందుకు కూడా రాలేదు. తండ్రిని హత్య చేసిన తర్వాత మాత్రమే ఆమె తెరపైకి వచ్చారు.  న్యాయం కోసం పోరాడుతున్నారు. ఇటీవలి వరకూ రాజకీయంగా ఆమె  ముందడుగు వేస్తారని ఎవరూ చెప్పలేదు. కానీ తన తండ్రి హంతకులకు  సీఎం జగన్ మద్దతు ఇస్తున్నారని.. కాపాడుతున్నారని గట్టిగా నమ్ముతున్నందున రాజకీయ వేదికపైకి వచ్చి ప్రజల మద్దతు కోరేందుకు సిద్ధమవుతున్నారు. 


గతంలో వైఎస్ వివేకానందరెడ్డి .. జగన్ సొంత పార్టీ పెట్టుకున్నప్పటికీ కాంగ్రెస్ లో ఉండిపోయారు . కాంగ్రెస్ తరపున ఉపఎన్నికల్లో పోటీ చేసినా ఓడిపోయారు. మళ్లీ ఇప్పుడు వివేకా కుటుంబమే .. వైఎస్ జగన్  పెట్టిన పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేయబోతున్నారు. కానీ ఈ సారి కాంగ్రెస్ తరపున కాకుండా.. కొత్తగా ఆలోచిస్తున్నారు. అప్పట్లో రాజకీయం అయితే.. ఇప్పుడు న్యాయం కోసం పోరాడుతున్నట్లుగా సునీత.. ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.  ఎలా చూసినా ఈ సారి పులివెందుల అసెంబ్లీ, కడప లోక్‌సభలో కీలకమైన పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.