YS Sunitha or her mother will contest the elections independently from Kadapa  : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు 2019 ఎన్నికల సమయంలో కీలక అంశంగా ఉంది.  ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే సమయంలో హత్య జరిగింది. అప్పటికే చీఫ్ సెక్రటరీతో పాటు డీజీపీ, ఇంటలిజెన్స్ చీఫ్‌లను కూడా ఈసీ బదిలీ చేసింది. కడప ఎస్పీని కూడా మార్చేశారు.  దీంతో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నిస్సహాయుడయ్యారు. తర్వాత ఓడిపోయారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చారు. వివేకా హత్య కేసులో చంద్రబాబుపైనే  వైసీపీ ఆరోపణలు చేసింది  ఈ ఎన్నికల్లోనూ అదే అంశం హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటి వరకూ నిందితుల్ని పట్టుకోలేకపోవడతో పాటు సీబీఐ విచారణకు ఆదేశించినా  పురోగతి లేకపోవడంతో.. ప్రజామద్దతు, ప్రజా తీర్పు కావాలని.. ప్రజల ముందుకు వెళ్లేందుకు వివేకా కుమార్తె సునీత సిద్ధమయ్యారు. 


తండ్రిని  చంపిన  వారికి శిక్ష పడేందుకు సుదీర్ఘ న్యాయపోరాటం


తన తండ్రి వివేకానందరెడ్డిని చంపేసి తాను రాక ముందే అంత్యక్రియలు చేయాలనుకున్న వారిని  వదిలి పెట్టేది లేదని షర్మిల అంటున్నారు. ఎన్ని ఒత్తిళ్లకు గురైనా ఆమె  నితంతర పోరాటం చేస్తున్నారు. న్యాయస్థానంలోనూ ఆమెకు ఊరట లభించలేదు. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాదనలు కూడా జరగడం లేదు. ఇదే  సమయంలో మరోసారి ఎన్నికలు ముంచుకొచ్చేశారు. ఈ సమయంలో ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టిన  సునీతా రెడ్డి  సోదరుడు జగన్ పై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. జగన్ మోహన్ రెడ్డిని కూడా సీబీఐ ప్రశ్నించాలని కోరుతున్నారు. అంతే కాదు జగన్ మోహన్ రెడ్డి పార్టీకి ఓటేయవద్దని కూడా పిలుపునిచ్చారు. సునీత ప్రెస్ మీట్ ఏపీ రాజకీయాల్లో సంచలనం అయింది. 


ప్రజా తీర్పు, ప్రజల మద్దతు కోసం ఎన్నికల బరిలోకి దిగబోతున్న సూచనలు 


ఢిల్లీలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో సునీత ప్రజా తీర్పు , ప్రజల మద్దతు కావాలని అడిగారు. ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యానని తెలిపారు. అయితే ఏ రూపంలో వెళ్లాలో ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. కానీ సునీత ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. షర్మిల ఏపీ పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె కూడా కాంగ్రెస్ లోకి వెళ్తారని అనుకున్నారు. ఈ దిశగా ఓ సారి చర్చలు  కూడా జరిపారు. కానీ కాంగ్రెస్ లో చేరికపై ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేయడం కన్నా స్వతంత్రంగా పోటీ చేస్తే అందరి మద్దతు లభిస్తుందన్న అంచనాలో ఉన్నారని అటున్నారు. ఓ పార్టీ తరపున బరిలోకి దిగితే ఇతర పార్టీలు మద్దతు ఇవ్వవు. వివేకానందరెడ్డి  హత్య విషయంలో జగన్మోహన్ రెడ్డి నిందితుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని అన్ని పార్టీలు విమర్శిస్తున్నాయి. పైగా  ప్రధాన నిందితుడిగా ఆరోపిస్తున్న అవినాష్ రెడ్డి ఎంపీగా బరిలోకి దిగే అవకాశం ఉంది. అందుకే సునీత లేదా ఆమె తల్లి అక్కడి నుంచి స్వతంత్రంగా పోటీ చేస్తే బాగుంటుందని అప్పుడు ప్రజలు నిందితుల వైపు లేరని.. బాధితుల వైపే ఉన్నారని అర్థమవుతుందని భావిస్తున్నారు. 


వివేకానందరెడ్డి ఉన్నంత వరకూ ఎప్పుడూ రాజకీయాల జోలికి రాని సునీత


 వైఎస్ వివేకానందరెడ్డి ఉన్నంత కాలం ఎప్పుుడూ వైఎస్ సునీత రాజకీయాల జోలికి రాలేదు. ఆమె వైద్యురాలు. హైదరాబాద్‌లో ఓ ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రిలో పని చేస్తూ ఉంటారు. తన వృత్తికే ఎక్కువ సమయం కేటాయిస్తారు. రాజకీయాల్లో ఎప్పుడూ ఆమె ప్రస్తావన రాలేదు. కానీ ఇటీవలి కాలం వరకూ రాలేదు. వివేకా హత్య నిందితులను.. రాజకీయం ద్వారా సొంత బంధువులే రక్షించాలనుకోవడంతో ఆమె ప్రజా మద్దతు కోరాలనుకుంటున్నారని అంటున్నారు. ఈ కేసు విషయంలో నిందితులు సునీతతో పాటు ఆమె తల్లిపైనా సోషల్  మీడియాలో పలు రకాల నిందలు వేశారు. ఈ క్రమంలో వారు పోరాటానికి దిగాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.