YS Sharmila on Chandrababu Naidu: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చంద్రబాబుపై కీలక ప్రశ్నలు సంధించారు. ఎన్డీఏ కూటమిలో ఉన్న బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని అడిగితే చంద్రబాబు ఎందుకు మోదీని అడగడం లేదని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం ఏర్పడడంలో టీడీపీ కింగ్ మేకర్‌గా ఉందని అలాంటప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు.
‘‘బిహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని నితీష్ తీర్మానం చేసి మోడీ ముందట డిమాండ్ పెడితే.. ఏపీకి హోదాపై చంద్రబాబు గారు కనీసం నోరు విప్పడం లేదు. మోదీ సర్కార్ లో కింగ్ మేకర్ గా ఉన్న మీరు.. హోదాపై ఎందుకు మౌనం వహిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. రాజధాని లేని రాష్ట్రంగా బీహార్ కంటే వెనకబడి ఉన్నామని మీకు తెలియదా? 15 ఏళ్లు హోదా కావాలని అడిగిన రోజులు మీకు గుర్తులేదా? రాష్ట్ర అభివృద్ధిలో ఏపీ 20 ఏళ్లు వెనకబడిందని చెప్పింది మీరే కదా? హోదా ఇవ్వకుంటే మద్దతు ఉపసంహరణ అని ఎందుకు అడగడం లేదు?
మోసం చేసిన మోదీతో హోదాపై సంతకం ఎందుకు పెట్టించలేరు? ప్రత్యేక హోదాపై మీ వైఖరి ఏంటో చెప్పాలని, రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం దగ్గర హోదా డిమాండ్ పెట్టాలని, చంద్రబాబు గారిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ప్రత్యేక ప్యాకేజీలు కాదు.. రాష్ట్ర అభివృద్ధికి హోదా ఒక్కటే మార్గమని అని గుర్తు చేస్తున్నాం’’ అని వైఎస్ షర్మిల అన్నారు.