YS Jagan Sensational Comments: రాష్ట్రంలో ఏ సినిమా బాగుంటే.. ఆ సినిమా పేరుతో మద్యం బ్రాండ్లు తెచ్చారని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ (YS Jagan) మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ పాలన 'దోచుకో.. పంచుకో.. తినుకో' (DPT) అన్న చందంగా మారిందని.. సర్కారు కనీసం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేకపోయిందని విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడి 5 నెలల గడిచినా సూపర్ 6 లేదు సూపర్ 7 లేదని ఎద్దేవా చేశారు. ఉచిత ఇసుక పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆపద్ధర్మ సీఎంగా ఉంటూ కూడా చంద్రబాబు బ్రాండ్లు రిలీజ్ చేశారని.. వాటిని వైసీపీ హయాంలో వచ్చిన బ్రాండ్లంటూ అబద్ధాలు ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. 'బూంబూం బీర్, ప్రెసిడెంట్ మెడల్ ఇవన్నీ చంద్రబాబు హయంలో తీసుకొచ్చినవే. రాష్ట్రంలో 20 డిస్టిలరీస్ ఉంటే అందులో 14 డిస్టిలరీస్ లైసెన్సులు బాబు హయాంలో వచ్చినవే. వైసీపీ హయాంలో ఒక్క డిస్టిలరీకి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. మా హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గించాం. మద్యాన్ని నియంత్రిస్తూనే ప్రభుత్వ ఆదాయం పెంచాం. చంద్రబాబు పాలనలో మద్యం ఏరులై పారుతోంది. రాష్ట్రంలో పేకాట క్లబ్స్ పెరిగిపోయాయి.' అని జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


'ప్రజల ఆశలతో చెలగాటం'


సీఎం చంద్రబాబు (CM Chandrbabu) అబద్ధాలకు రెక్కలు కట్టారని.. ఎన్నికలప్పుడు ప్రజల ఆశలతో చెలగాటమాడుతూ తప్పుడు ప్రచారాలు చేశారని జగన్ మండిపడ్డారు. 'అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక అమలుకు క్లిష్ట పరిస్థితులు ఉన్నాయంటున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఓ వైపు ఉచిత ఇసుక అంటున్నారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం పడిపోయింది. ఇసుక ధరలు చూస్తే దారుణంగా ఉన్నాయి. గతంలో ఏడాదికి రూ.750 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చేది. ఈ 5 నెలల్లో ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం సున్నా. రూ.10 వేలు ఇస్తామని చెప్పి వాలంటీర్లను మోసం చేశారు. పిల్లలకు రూ.15 వేలు ఇస్తామని చెప్పి మోసం చేశారు. గ్రామస్థాయిలో మద్యం మాఫియా నడుస్తోంది. ఎమ్మార్పీ రేట్ల కంటే ఎక్కువ ధరకు మద్యం అమ్ముతున్నారు.' అంటూ జగన్ ధ్వజమెత్తారు.


అధికార పార్టీ మనుషులకో ఇసుక తీసే కాంట్రాక్టులు కట్టబెట్టారని జగన్ మండిపడ్డారు. టెండర్‌కు 2 రోజులు మాత్రమే సమయం ఇచ్చారని.. అందరూ పండుగ బిజీలో ఉంటే దోచేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆరోపించారు. వైసీపీ హయంలో పారదర్శకంగా ఇసుక విధానం తెచ్చామని.. దోపిడీకి అవకాశం లేని విధంగా చేశామని చెప్పారు. 


'చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చిందా?'


సీమెన్స్ ప్రాజెక్టు కోసం చంద్రబాబు 13 చోట్ల సంతకాలు చేశారని.. షెల్ కంపెనీల ద్వారా రూ.371 కోట్ల నిధులు మళ్లించారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సామ్రాజ్యం ఉంటే గోబెల్స్ ప్రచారం చేసుకుంటారా.? అని ప్రశ్నించారు. 'తనకు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. స్కిల్ స్కామ్‌లో ఈడీ ప్రెస్ నోటి రిలీజ్ చేసింది. చంద్రబాబుకు క్లీన్ చిట్ అని ఎక్కడైనా ఉందా.?. నిధులు మళ్లించినందుకే ఈడీ ఆస్తులను అటాచ్ చేసింది.' అని జగన్ పేర్కొన్నారు.


Also Read: Andhra Pradesh Latest Updates: 2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక