YS Viveka case :  వైఎస్ వివేకానందరెడ్డి  హత్య కేసులో కీలక నిందితునిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టి వేసింది. భాస్కర్ రెడ్డి అత్యంత ప్రభావిత వ్యక్తి అని బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారని.. సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐతో  పాటు సునీత చేసిన వాదలను సీబీఐ కోర్టు న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్నారు.కేసు కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వలేమని న్యాయమూర్తి తెలిపారు. 


భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇస్తే దర్యాప్తు ప్రభావితం అవుతుదని సీబీఐ వాదన 


వైఎస్ భాస్కర్ రెడ్డి.. ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు కుట్ర, సాక్ష్యాలను చెరిపివేయడంలో వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి ప్రమేయం ఉందని.. దీనికి సంబంధిత ఆధారాలు తమ వద్ద ఉన్నాయని కోర్టులో దాఖలు చేసిన కౌంటర్‌లో సీబీఐ పేర్కొంది. ఈ కేసును పక్కదారి పట్టించే విధంగా, సాక్షులను ప్రభావితం చేసేందుకు వైఎస్ భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి అడుగడుగునా ప్రయత్నిస్తున్నారని సీబీఐ పేర్కొంది. భాస్కర్ రెడ్డి అత్యంత ప్రభావితమైన వ్యక్తి అని ఆయన్ను అరెస్టు చేసినప్పుడు కడపలో జరిగిన ధర్నాలు, ప్రదర్శనలే భాస్కర్‌ రెడ్డి బలానికి నిదర్శనని సీబీఐ తెలిపింది. వైఎస్ భాస్కర్‌రెడ్డి బయట ఉంటే చాలు పులివెందులలో సాక్షులు ప్రభావితమైనట్లే అని పేర్కొంది. వైఎస్ భాస్కర్‌ రెడ్డికి బెయిల్‌ ఇచ్చి ఎన్ని షరతులు పెట్టినా నిరుపయోగమే అని.. సాక్షులను, ఆధారాలను ప్రభావితం చేస్తే కేసుకు పూడ్చలేని నష్టమని తెలిపింది. దర్యాప్తునకు సహకరించానని భాస్కర్‌రెడ్డి చెప్పడం పూర్తిగా అబద్ధమని.. కడప ఎస్పీ సమాచారం మేరకు భాస్కర్‌రెడ్డిపై గతంలో 3 కేసులున్నాయని సీబీఐ పేర్కొంది.


కౌంటర్ లో సీఎం జగన్ ప్రస్తావన కూడా చేసిన సీబీఐ 


భాస్కర్ రెడ్డి బెయిల్ ను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన కౌంటర్‌లో సీఎం జగన్ ప్రస్తావన కూడా సీబీఐ చేసింది.  వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయం సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉదయం 6.15 గంటలకు ముందే తెలుసని సీబీఐ పునరుద్ఘాటించింది. వివేకా పీఏ బయటికి చెప్పకముందే జగన్‌కు తెలుసని దర్యాప్తులో గుర్తించామని పేర్కొంది.  ఉదయం 5.20కి ముందే అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డితో గంగిరెడ్డి మాట్లాడినట్లు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు. అయితే కేసు పెట్టొద్దని, పోస్టుమార్టం వద్దని సీఐ శంకరయ్యకు అవినాష్‌, శివశంకర్‌రెడ్డి చెప్పారని సీబీఐ తెలిపింది.  


అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ


ఈ కేసులో అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఒక వేళ అరెస్ట్ చేస్తే రూ. ఐదు లక్షల పూచీకత్తుతో బెయిల్ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో గత శనివారం ఆయన విచారణకు హాజరైనప్పుడు అరెస్ట్ చేసి పూచీకత్తుపై విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. ఈ బెయిల్ తర్పును సవాల్ చేస్తూ.. సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై మంగళవారం విచారణ జరగనుంది.