వినియోగదారులకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావడంలో ముందుంటుంది వాట్సాప్. ఇప్పటికే అద్భుతమైన ఫీచర్లను పరిచయం చేసిన ఈ ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్, ఇప్పుడు హై క్వాలిటీ ఫోటోలను, మిత్రులకు, కుటుంబ సభ్యులకు పంపించుకునే అవకాశం కల్పిస్తోంది.  


ఇకపై హై క్వాలిటీ ఫోటోలు పంపుకునే అవకాశం


వాట్సాప్ లేటెస్ట్ సమాచారం అందించే WABetaInfo తాజాగా ఈ సరికొత్త వెసులుబాటు గురించి కీలక విషయాలను వెల్లడించింది. iOS, Android రెండింటి లోనూ బీటా వెర్షన్ వినియోగదారులు ఇతరులకు హైక్వాలిటీ ఫోటోలు పంపే అవకాశాన్ని పరిచయం చేసింది. వాస్తవానికి వాట్సాప్ నుంచి ఫోటోలు, వీడియోలు పంపే సమయంలో వాట్సాన్ ఆటోమేటిక్ గా కంప్రెస్ చేస్తుంది. ఈ కారణంగా ఆయా ఫోటోలు, వీడియోలు క్వాలిటీని కోల్పోతాయి. అయితే, ఇప్పుడు సరికొత్త ఫీచర్ సాయంతో హై రెజల్యూషన్ ఫోటోలను పంపుకునే అవకాశం ఉంటుంది.


తాజాగా తీసుకొచ్చిన హై క్వాలిటీ ఇమేజ్ సెండింగ్ ఆప్షన్ ను ఎంచుకుంటేనే హై క్వాలిటీ ఫోటోలను ఎదుటి వారికి పంపే అవకాశం ఉంటుంది. వాస్తవానికి ఫోటోలు, వీడియోలు పంపించే సమయంలో ఇప్పటికీ అసలు రిజల్యూషన్ లో కాకుండా, లైట్ కంప్రెషన్ చేయబడుతుంది. అయితే, హై రిజల్యూషన్‌లో ఫోటోలను పంపడానికి వినియోగదారులు HD బటన్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అయితే, HD ఫోటోలను పంపే అవకాశం చాట్ లో భాగస్వామ్యం చేయబడిన ఫోటోలకు మాత్రమే పరిమితం చేయబడింది. ఆండ్రాయిడ్ కోసం 2.23.12.13 వాట్సాప్ బీటా, iOS కోసం 23.11.0.76 వాట్సాప్ బీటాలో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. వాట్సాప్ ఈ ఫీచర్ ను నెమెమ్మదిగా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అయితే, ఈ ఫీచర్ అందరికీ చేరడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది.


ప్రస్తుతం కొన్ని ఫోటోలకే పరిమితం!


వాట్సాప్ తీసుకొచ్చిన ఈ ఫీచర్ ప్రస్తుతం కొన్ని ఫోటోలకే పరిమితం అయ్యింది. ఈ ఫీచర్ ద్వారా ఫోటోల ఇన్ చాట్ షేరింగ్‌కు మాత్రమే పరిమితం చేసినట్లు వాట్సాప్ ప్రకటించింది. ఇది వీడియోలు,  స్టేటస్‌లకు పనిచేయదని తెలిపింది. యూజర్లు హై క్వాలిటీతో వీడియోను షేర్ చేయాలి అనుకుంటే, దానిని డాక్యుమెంట్ ల రూపంలో షేర్ చేయవలసి ఉంటుంది. అయితే, త్వరలోనే అన్ని ఫోటలకు, వీడియోలకు ఈ ఫీచర్ ను పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది.


అటు వాట్సాప్, మరికొన్ని ఫీచర్ల కు సంబంధించి వర్క్ చేస్తోంది. వాట్సాప్ లోనే ఆఫీస్ మీటింగ్స్ నిర్వహించుకునేందుకు సరికొత్త ఫీచర్ ను పరిచయం చేయబోతున్నది. ప్రస్తుతం ఈ ఫీచర్ చివరి దశ టెస్టింగ్ జరుపుకుంటోంది. కొద్ది రోజుల క్రితమే వాట్సాప్ 'స్క్రీన్ షేరింగ్' ఫీచర్‌ను విడుదల చేసింది.  ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా టెస్ట్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. అంతేకాదు, త్వరలోనే ‘వాట్సాప్ యూజర్ నేమ్స్’ అనే ఫీచర్ ను కూడా అందుబాటులోకి తీసుకురాబోతోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలపింగ్ దశలో ఉంది. ఇకపై ఫోన్ నెంబర్లు, కాకుండా యూజర్ నేమ్స్ సాయంతో చాట్ చేసుకునే అవకాశం ఉంటుంది.  


Read Also: మీ సెల్ ఫోన్‌లోకి మాల్వేర్ చేరిందా? ఈ ఫ్రీ టూల్‌తో ఈజీగా రిమూవ్ చేసుకోండి!