మాజీ మంత్రి, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారని తెలిసిందే. హైదరాబాద్ కు తరలించిన పోలీసులు సీబీఐ మేజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టగా 2 వారాల రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు భాస్కర్ రెడ్డిని చంచల్ గూడ జైలుకు తరలించారు. భాస్కర్ రెడ్డి అరెస్టుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి  రామకృష్ణ స్పందించారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కారణంగానే వివేకా హత్య కేసులో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. ఏపీ సీఎం జగన్ కు చిత్తశుద్ధి ఉంటే బాబాయ్ వివేకా హత్య కేసుపై స్పందించాలని డిమాండ్ చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.


వివేకా హత్య జరిగి నాలుగేళ్ల తరువాతనైనా వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. సీఎం జగన్ పదే పదే ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను రిక్వెస్ట్ చేసి ప్రసన్నం చేసుకోవడంతో కేసు దర్యాప్తులో జాప్యం జరిగిందన్నారు. బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అన్ని వేళ్లు సీఎం జగన్ వైపు చూపిస్తున్నాయని, కనుక చిత్తశుద్ధి ఉంటే భాస్కర్ రెడ్డి అరెస్టుపై స్పందించాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు. సీబీఐ అధికారులు ఏప్రిల్ నెలాఖరులోగా కేసు విచారణ పూర్తి చేసి వివేకాను హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వివేకాను హత్య చేసి గుండెపోటుగా, సహజ మరణంగా చిత్రీకరించేందుకు ఎవరు ప్రయత్నించారన్నది రాష్ట్ర ప్రజలకు తెలుసునన్నారు. వివేకాను హత్య చేసి శవానికి కుట్లువేసి సహజ మరణంగా ప్రచారం చేశారని ఆరోపించారు.


వైఎస్ భాస్కర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్
వివేకా  హత్య కేసులో అరెస్టైన వైఎస్ భాస్కర్ రెడ్డికి సీబీఐ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు. ఈ నెల 29 వరకు భాస్కర్ రెడ్డికి రిమాండ్ విధించింది. ఆర్యోగ కారణాల దృష్ట్యా ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని భాస్కర్ రెడ్డి తరఫు న్యాయవాదులు సీబీఐ న్యాయమూర్తిని కోరారు. అయితే ఈ విషయాన్ని పరిశీలిస్తామని న్యాయమూర్తి అన్నారు. అయితే సీబీఐ అధికారులు భాస్కర్ రెడ్డి కస్టడీ కోరుతూ పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది. దీనిపై రేపు నిర్ణయిస్తామని కోర్టు తెలిపింది. దీంతో భాస్కర్ రెడ్డిని చంచల్ గూడ జైలుకు తరలిస్తున్నారు.   


వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు భాస్కర్ రెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ కు ఆదేశించారు.  వివేకా హత్య కేసులో ఏ-7 నిందితుడిగా వైఎస్ భాస్కర్ రెడ్డిపై అభియోగాలు ఉన్నాయి. భాస్కర్ రెడ్డి మెడికల్ రిపోర్టు, రిమాండ్ రిపోర్టును సీబీఐ అధికారులు న్యాయమూర్తికి సమర్పించారు. రిపోర్టుల పరిశీలన తర్వాత భాస్కర్ రెడ్డికి రిమాండ్ విధించారు సీబీఐ న్యాయమూర్తి. రేపు నాంపల్లి సీబీఐ కోర్టులో భాస్కర్ రెడ్డిని సీబీఐ కస్టడీకి కోరే అవకాశం ఉంది.


ఎంపీ అవినాష్ రెడ్డి సీరియస్.. 
తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్టుపై కడప ఎంపీ అవినాష్ రెడ్డి స్పందించారు. సీబీఐ అధికారుల విచారణ తీరు సరిగ్గా లేదంటూ వైఎస్సార్ సీపీ ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్థంపర్థం లేని విషయాలను సీబీఐ పెద్దదిగా చూస్తూ.. ఈ స్థాయికి దిగజారడం విచారకరమని వ్యాఖ్యానించారు.  అధికారుల తీరు గురించి సీబీఐ పెద్దలకు కూడా తెలియజేశామన్నారు. పాత అధికారులు చేసిన తప్పులను కొత్త అధికారులు కొనసాగిస్తున్నారని అన్నారు.