YS Viveka Case : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. సాయంత్రం ఐదు గంటల వరకూ .. మొత్తంగా ఏడు గంటల పాటు ప్రశ్నించారు. ముందస్తు బెయిల్ ఇస్తూ హైకోర్టు పెట్టిన షరతుల మేరకు అవినాష్ రెడ్డి ప్రతి శనివారం సీబీఐ ఎదుట హాజరవుతున్నారు. గత శనివారం కూడా హాజరయ్యారు. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించింది. గత శనివారం విచారణకు హాజరైనప్పుడు.. అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. అయితే రూ. ఐదు లక్షల పూచీకత్తుతో విడుదల చేసినట్లుగా చెబుతున్నారు. ఇది కూడా హైకోర్టు పెట్టిన షరతే.
ముందస్తు బెయిల్ ను సవాల్ చేస్తూ సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ
కడప ఎంపీ అవినాష్ రెడ్డికి బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సునీత దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం విచారణ జరపనుంది. అవినాశ్‌కు గత నెల 31న తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సునీత సుప్రీంకోర్టులో సవాలు చేశారు. అవినాశ్‌పై మోపిన అభియోగాలన్నీ చాలా కీలకమైనవని పిటీషన్‌లో సునీత పేర్కొన్నారు. సీబీఐ మోపిన అభియోగాలను హైకోర్టు సరిగ్గా పరిగణలోకి తీసుకోలేదని పిటిషన్‌లో సునీత పేర్కొన్నారు. హైకోర్టు తీర్పులో కొన్ని లోపాలున్నాయని కూడా సునీత తెలిపారు. అవినాశ్ ముందస్తు బెయిల్‌ను సీబీఐ సైతం వ్యతిరేకిస్తోందని పిటిషన్‌లో వెల్లడించారు. సునీత పిటీషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంలో సీబీఐ సైతం వాదనలు వినిపించనుంది.
భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టేసిన సీబీఐ కోర్టు
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితునిగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టి వేసింది. భాస్కర్ రెడ్డి అత్యంత ప్రభావిత వ్యక్తి అని బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారని.. సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐతో పాటు సునీత చేసిన వాదలను సీబీఐ కోర్టు న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్నారు.కేసు కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వలేమని న్యాయమూర్తి తెలిపారు.
భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇస్తే దర్యాప్తు ప్రభావితం అవుతుదని సీబీఐ వాదన
వైఎస్ భాస్కర్ రెడ్డి.. ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు కుట్ర, సాక్ష్యాలను చెరిపివేయడంలో వైఎస్ భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి ప్రమేయం ఉందని.. దీనికి సంబంధిత ఆధారాలు తమ వద్ద ఉన్నాయని కోర్టులో దాఖలు చేసిన కౌంటర్‌లో సీబీఐ పేర్కొంది. ఈ కేసును పక్కదారి పట్టించే విధంగా, సాక్షులను ప్రభావితం చేసేందుకు వైఎస్ భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి అడుగడుగునా ప్రయత్నిస్తున్నారని సీబీఐ పేర్కొంది. భాస్కర్ రెడ్డి అత్యంత ప్రభావితమైన వ్యక్తి అని ఆయన్ను అరెస్టు చేసినప్పుడు కడపలో జరిగిన ధర్నాలు, ప్రదర్శనలే భాస్కర్ రెడ్డి బలానికి నిదర్శనని సీబీఐ తెలిపింది. వైఎస్ భాస్కర్‌రెడ్డి బయట ఉంటే చాలు పులివెందులలో సాక్షులు ప్రభావితమైనట్లే అని పేర్కొంది. వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇచ్చి ఎన్ని షరతులు పెట్టినా నిరుపయోగమే అని.. సాక్షులను, ఆధారాలను ప్రభావితం చేస్తే కేసుకు పూడ్చలేని నష్టమని తెలిపింది. దర్యాప్తునకు సహకరించానని భాస్కర్‌రెడ్డి చెప్పడం పూర్తిగా అబద్ధమని.. కడప ఎస్పీ సమాచారం మేరకు భాస్కర్‌రెడ్డిపై గతంలో 3 కేసులున్నాయని సీబీఐ పేర్కొంది.