Youth Congress criticizes Jagan  :  అంతర్జాతీయ వేదికగా జరిగిన ఏఐ  సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ చేపట్టిన నిరసనలను జగన్ విమర్శించడం వివాదాస్పదమయింది.   ప్రపంచ దేశాల ప్రతినిధుల ముందు భారత్ ప్రతిష్టను మసకబార్చేలా యూత్ కాంగ్రెస్ నేతలు ప్రవర్తించడం అక్షేపణీయమని  వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.  రాజకీయ విభేదాలు ఏవైనా ఉండవచ్చు కానీ, అంతర్జాతీయ వేదికలపై దేశం ఐక్యంగా కనిపించాలని, భారత్‌ను ప్రపంచం ముందు చులకన చేయడం ఆమోదయోగ్యం కాదని వైసీపీ స్పష్టం చేసింది.   

జగన్ చేసిన ట్వీట్ పై యూత్ కాంగ్రెస్ స్పందించింది. కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా ఘాటు విమర్శలు చేసింది.  మీ తండ్రి, మా గర్వించదగ్గ నాయకుడు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన జీవితమంతా మతతత్వ, విభజన , రాజీ పడే శక్తులకు వ్యతిరేకంగా పోరాడారని, ప్రస్తుతం మీరు సిబిఐ, ఈడి కేసులను ఎదుర్కొంటున్న విషయం మాకు తెలుసని, అయితే కనీసం మీ తండ్రి ఆశయాలను, ఆయన వారసత్వాన్ని ఇలా బహిరంగంగా దిగజార్చవద్దని  ఈ సందర్భంగా కాంగ్రెస్ పేర్కొంది.   

ఈ ట్వీట్ పై అంబటి రాంబాబు స్పందించారు.  దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వారసత్వం గురించి ఇప్పుడు మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు, ఆయన మరణం తర్వాత ఆ కుటుంబాన్ని ఎంతగా వేధించారో దేశమంతా చూసిందని  అన్నారు.  వైఎస్సార్ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చి, ఆయన మరణానంతరం గౌరవాన్ని తగ్గించేలా ప్రవర్తించింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు.  తమ రాజకీయ అవసరాల కోసం చరిత్రను వక్రీకరిస్తూ ఇప్పుడు నీతులు చెప్పడం హాస్యాస్పదమని  అన్నారు.   

రాజకీయ సమీకరణాలతో సంబంధం లేకుండా, జాతీయ ప్రయోజనాల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ స్పష్టమైన వైఖరితో ఉందని  అంబటి చెప్పారు.  రాష్ట్రపతి ఎన్నికలు, పార్లమెంట్‌లో కీలక బిల్లుల విషయంలో తమ పార్టీ దేశ హితానికే మొగ్గు చూపిందని, సంకుచిత రాజకీయాల కోసం స్టాండ్ మార్చుకోలేదని స్పష్టం చేసింది.