Ysrcp Rebel Mlas Meet Speaker Seetharam: వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి సోమవారం స్పీకర్‌ తమ్మినేని సీతారాంను కలిశారు. తాము ఇది వరకే లేఖలో రాసిన విధంగా 4 వారాల సమయం కోరినట్లు ఎమ్మెల్యేలు తెలిపారు. సహజ న్యాయ సూత్రాల ప్రకారం తాము కోరిన వెసులుబాటు కల్పించాలని స్పీకర్ కు విన్నవించినట్లు చెప్పారు. తాము పార్టీ నియమాలు ఉల్లంఘించినట్లు వైసీపీ చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాల్సిందిగా సభాపతిని, అసెంబ్లీ కార్యదర్శిని కోరామని అన్నారు. సీఎం జగన్ ఒత్తిడి మేరకే స్పీకర్ పని చేస్తున్నారని వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చినా రశీదు అడిగితే మాత్రం ఇవ్వలేదని వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి ఆరోపించారు. స్పీకర్‌ తీరు చూస్తుంటే చట్టాలపై గౌరవం పోతోందని మండిపడ్డారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటమి భయంతోనే కావాలనే తమపై అనర్హత వేటు వేయాలని ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాలపై ఉన్న గౌరవంతోనే ఆయన్ను కలిసి సమయం కావాలని నేరుగా కోరామని, కానీ ఆయన దీనికి అంగీకరించకపోవడం వల్ల ఇప్పుడు కోర్టును ఆశ్రయించక తప్పదన్నారు. కోర్టులు, ప్రజా కోర్టుల్లోనే పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.


వారిపైనా చర్యలు తీసుకుంటారా.?


స్వతంత్రంగా వ్యవహరించాల్సిన సభాపతి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆరోపించారు. ఏపీలో స్పీకర్‌ రూల్ బుక్‌ను కూడా విభజించారని ఆయన మండిపడ్డారు. మరో రెండు, మూడు నెలల్లో సభాపతి కాలం ముగిసిపోబోతోందని, చివరి రోజుల్లో అయినా ఆయన చరిత్రలో నిలిచే నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఇప్పుడు వైసీపీలో చాలా మంది ఎమ్మెల్యేలు తమకన్నా ఎక్కువ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్నారు. 16 నెలల ముందు తాము ఏం చెప్పామో ఇప్పుడు అందరూ అదే చెబుతున్నారన్నారు. వారిపైనా చర్యలు తీసుకుంటారా అని వారు ప్రశ్నించారు.


న్యాయ నిపుణుల సలహా


అంతకు ముందు సభాపతిని కలవడంపై రెబల్ ఎమ్మెల్యేలు న్యాయ నిపుణులు సలహా తీసుకున్నారు. అనర్హత పిటిషన్‌పై సమయం కావాలని కోరినా స్పీకర్ అంగీకరించకపోవడంతో నేరుగా కలిసి సమయం కోరాలని నిర్ణయించారు. అనర్హతకు సంబంధించి న్యాయ నిపుణులతో చర్చించేందుకు.. పేపర్స్, వీడియో క్లిప్పింగుల వాస్తవ నిర్ధారణకు సమయం కావాలని రెబల్ ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి తెలిపారు. తనకు ఆరోగ్యం బాగాలేదని వైద్యులు ఇచ్చిన నివేదికను ఇచ్చినా స్పీకర్‌ పరిగణనలోకి తీసుకోలేదని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వాపోయారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగే సీక్రెట్ ఓటింగ్‌లో విప్‌ ఉల్లంఘించారని ఎలా నిర్థారిస్తారన్నారు. వైసీపీలో రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు, చేయని ఎమ్మెల్యేలు కూడా జగన్‌ను విమర్శిస్తున్నారని.. వారిపై లేని చర్యలు తమపై ఎందుకని ఆయన మండిపడ్డారు. కరోనాతో చికిత్స తీసుకుంటున్నానని తెలిపినా, నేరుగా హాజరు కావాల్సిందేనని సభాపతి ఆదేశించారని మరో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మండిపడ్డారు. స్పీకర్‌ ఫార్మెట్‌లో గంటా శ్రీనివాసరావు రాజీనామా ఇచ్చి మూడున్నారేళ్లు అయినా పట్టించుకోని స్పీకర్‌.. తమకు మాత్రం నోటీసులు ఇచ్చి రెండు వారాల్లోనే సమాధానం ఇవ్వాలనడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.


మరోవైపు, టీడీపీని వీడిన ఎమ్మెల్యేలపైనా అనర్హత వేటు వేయాల్సిందిగా ఆ పార్టీ విప్ డోలా వీరాంజనేయస్వామి ఇచ్చిన పిటిషన్ ఆధారంగా నలుగురు ఎమ్మెల్యేలు మద్దాలి గిరి, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేశ్, కరణం బలరాం సైతం నేరుగా వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా సభాపతి తాఖీదులు జారీ చేశారు. తెలుగుదేశాన్ని వీడిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై న్యాయ నిపుణులతో ఆ పార్టీ నేతలు సంప్రదింపులు చేస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం కీలకంగా మారింది.