Balineni Srinivasa Reddy: కొద్ది రోజులుగా పార్టీ మారుతున్నారంటూ వస్తున్న కథనాలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి  స్పందించారు. తాను ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. గురువారం తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని బాలినేని శ్రీనివాస్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఒంగోలు నియోజకవర్గ సమస్యలను ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఒంగోలు నగరంలో భూ అక్రమాల కేసు విషయంలో ఈ మధ్య రేగిన వివాదం గురించి వివరించారు.


సొంత పార్టీ నేతలే టార్గెట్ చేస్తున్నారు
సొంత పార్టీలోనే కొంత మంది తనను టార్గెట్ చేస్తున్నారని సీఎం జగన్‌కు దృష్టికి బాలినేని తీసుకెళ్లారు. జిల్లాలో పార్టీ పరిస్థితి, వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. సీఎం జగన్‌తో భేటి ముగిసిన అనంతరం బాలినేని మీడియాతో మాట్లాడారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. పార్టీ మారే ఉద్దేశ్యం ఉంటే ఇక్కడికి రావాల్సిన అవసరం లేదని అన్నారు. నాలుగేళ్ల మంత్రి పదవి వదులుకుని జగన్ కోసం వచ్చానని గుర్తు చేశారు.


జగన్‌తో అపాయింట్‌మెంట్ అవసరం లేదు
సీఎం జగన్‌ దగ్గరకు వెళ్లడానికి తనకు అపాయింట్మెంట్ అవసరం లేదని  బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. సీఎం జగన్ తనను ఎప్పుడైనా నేరుగా వచ్చి కలవమని చెప్పారని అన్నారు. తనపై లేనిపోని దుష్ప్రచారం జరుగుతోందని అన్నారు. తాను చాలా సెన్సిటివ్ అని, మీడియాను అడ్డం పెట్టుకుని తనను ఎవరైనా అంటే సహించనని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మీద జరుగుతున్న తప్పుడు ప్రచారాలను సీఎం దృష్టికి తీసుకుని వెళ్లినట్లు చెప్పారు. 


జగన్‌కు అన్నీ తెలుసు
జిల్లాలో జరుగుతున్న అన్ని విషయాలు సీఎం జగన్‌కు తెలుసునని బాలినేని అన్నారు. ప్రకాశం జిల్లాలో నకిలీ స్టాంపుల కుంభకోణంలో సీఐడీ అవసరం లేకుండా 21 మందితో టీంలను ఏర్పాటు చేశారని బాలినేని చెప్పారు. తనకు, అవినీతి, అక్రమాలకు పాల్పడాల్సిన అవసరం లేదన్నారు. తాను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్న బాలినేని ఏదైనా చెప్పాలనుకుంటే సీఎం జగన్‌కే చెబుతానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో సైతం ఒంగోలులో వైసీపీ జెండా ఎగురుతుందన్నారు.


అసంతృప్తితో రగిలిపోతున్న బాలినేని
జిల్లాలో నకిలీ భూ దస్తావేజుల కేసులో తీరుపై ఒంగోలు పోలీసుల వ్యవహారశైలిపై బాలినేని కొంతకాలంగా అసంతృప్తితో రగిలిపోతున్నారు. ప్రకాశం  ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా గన్‌మెన్‌లను ప్రభుత్వానికి తక్షణమే సరెండర్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. నకిలీ భూపత్రాల కేసులో ఇప్పటి వరకు 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంతటి వారినైనా వదిలిపెట్టవద్దని మూడు రోజుల క్రితం కలెక్టర్‌ సమక్షంలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఎస్పీని కోరారు.  


అసలు దోషులు తెలిసినా...!
అసలు దోషుల తెలిసినా కూడా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న బాలినేని, తన రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ చూడలేదని మండిపడ్డారు. నకిలీ భూ దస్తావేజుల కేసులో ఉన్న ఎంతటి వారినైనా అరెస్టు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ కేసులో అధికార పార్టీ నేతలు ఉన్నా వదిలిపెట్టవద్దని, అరెస్ట్ చేసి తీరాల్సిందేనన్నారు.  పోలీసులు తన సూచనలను పెడచెవిన పెడుతున్నారని లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు.