Janasena News : చీరాల మాజీ ఎమ్మెల్యే,వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు   పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్నారు.గతంలోనే పవన్ కల్యాణ్‌తో సమావేశమై పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరిచారు. ఇప్పటికే స్వాములు చీరాలలో పార్టీ ఆఫీసుకును కూడా ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా  ఆమంచి   అనుచరులు, అభిమానులు, కాపు సంఘ నేతలు జనసేన ఆఫీస్‌కు  భారీగా తరలి వెళ్లనున్నారు.  
 


సీటుతో పని లేకుండా జనసేన కోసం పని చేస్తానన్న ఆమంచి స్వాములు


జనసేన నుండి తనకు సీటు ఇచ్చిన ఇవ్వకపోయినా పార్టీ బలోపేతం కోసం పనిచేస్తానని పవన్ కల్యాణ్ విధానాలు నచ్చి..ఆయన ఆలోచనలు నచ్చి పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని స్వాములు చెబుతున్నారు.  జనసేన పార్టీ బలోపేతం కోసమే తాను పనిచేయాలని పదవుల కోసం కాదని తెలిపారు. కానీ పార్టీ టికెట్ ఇస్తే పోటీలో ఉంటానని..టికెట్ ఇవ్వకపోయినా పార్టీ బలోపేతం కోసం పనిచేస్తానని తెలిపారు. ఆమంచి సోదరులు ఇద్దరూ కలసి కట్టుగానే రాజకీయాలు చేసేవారు. వారి రాజకీయ క్షేత్రం చీరాల. అయితే ఆమంచి కృష్ణమోహన్ ను .. వైసీపీ  హైకమాండ్ పర్చూరుకు పంపింది. చీరాలలో  టీడీపీ నుంచి వచ్చిన కరణం  బలరాంకు సీటు కేటాయించారు. అయితే పర్చూరుకు వెళ్లడం ఆమంచికి ఇష్టం లేదని చెబుతున్నారు. 


చీరాల ఆమంచి క్యాడర్ అంతా జనసేనలోకి వెళ్తుందా ?                  


ఆమంచి కృష్ణ మోహన్ కాంగ్రెస్ సభ్యునిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 2000లో వేటపాలెం మండలం నుండి ZPTC సభ్యునిగా ఎన్నికయ్యారు. అలా అంచెలంచెలుగా ఎదిగి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. టీడీపీ అభ్యర్థిపై వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు అనూహ్యంగా ఆయన సోదరుడు జనసేనలో చేరడం చీరా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. టీడీపీతో పొత్తు ఉంటే.. చీరాల సీటు కేటాయిస్తారన్న ఉద్దేశంతో .. సోదరులిద్దరూ మాట్లాడుకుని .. ముందుగా ఒకరు జనసేనలో చేరుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. 


ముందు జాగ్రత్తగా సోదరులు మాట్లాడుకునే రాజకీయం చేస్తున్నారా ?                                                                  


చీరాలలో కరణం బలరాం  టీడీపీ తరపున గెలుపు తర్వాత చీరాల రాజకీయం మారింది. ఎమ్మెల్యే కరణం అనూహ్యంగా వైసీపీకి దగ్గరవడంతో ఆమంచికి చీరాలలో ప్రాధాన్యతను తగ్గించారు. అంతేకాకుండా కరణం బలరాం వర్గంతో విభేదాలు కూడా ఉన్నాయి. కొంతకాలంగా ఆమంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధిష్టానం చీరాలపై దృష్టిసారించి ఆ నియోజకవర్గాన్ని కరణం బలరాంకు అప్పగించింది. పర్చూరు నియోజకవర్గానికి ఇన్ ఛార్జిగా ఆమంచి కృష్ణమోహన్ ను నియమించింది. వచ్చే ఎన్నికల నాటికి ఏదైనా జరగవచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది.