Jagan London Tour : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి లండన్ పర్యటనలో ఎన్నారైలతో కార్యక్రమంలో పాల్గొంటారంటూ జరుగుతున్న ప్రచారంపై వైసీపీ క్లారిటీ ఇచ్చింది. జగన్ పర్యటనలో అలాంటి కార్యక్రమం ఏమీ లేదని స్పష్టం చేసింది. లండన్‌ పర్యటనలో ఉన్న జగన్‌ సెప్టెంబర్‌ 9వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అందరికీ అందుబాటులో ఉంటారని.. వచ్చి కలవొచ్చని.. లంచ్‌ కూడా ఉంటుందని సోషల్‌ మీడియాలో ఓ ప్రకటన వైరల్‌ అయ్యింది. మీట్‌ అండ్‌ గ్రీట్‌ విత్‌ అవర్‌ లీడర్‌ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అంటూ ఈ ప్రకటనను పొందుపర్చారు. లండన్‌ ఎంహెచ్సీ సెంటర్‌ ఇందుకు వేదిక అంటూ ఆహ్వానితుల వివరాలేవీ లేకుండా ఈ ప్రకటన వైరల్ అయింది. దీనిపై వైసీపీ నేతలకు పెద్ద ఎత్తున ఎంక్వయిరీలు వచ్చాయి.                                                 



దీంతో వైసీపీ లండన్ నేత చింతా ప్రదీప్ రెడ్డి  స్పందించారు. జగన్ రెడ్డి లండన్ పర్యటనకు తమకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టంచేశారు. ఈ టూర్‌ గురించి మీకెంత తెలుసో.. మాకు కూడా అంతే తెలుసన్నారు. యూకేలో ఏ మీటింగును నిర్వహించడం లేదని.. ఎవరో ఆకతాయిలు కావాలనే వాట్సాప్‌లలో దాన్ని సర్క్యులేట్‌ చేసి వైరల్‌ చేస్తున్నారని.. దాన్ని పట్టించుకోవద్దని ఆయన సూచించారు. జగన్‌తో ఎలాంటి మీటింగులు లేవని స్పష్టం చేశారు.                                       
 





 


జగన్ లండన్ వెళ్తున్నారు అన్నదే అందరికీ తెలుసు. ఎక్కడున్నారు.. ఏం చేస్తున్నారనే విషయాలు వైఎస్సార్సీపీ నేతలకు కూడా తెలీదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం జగన్ ది పూర్తిగా వ్యక్తిగత పర్యటన అని.. అందుకే పూర్తి రహస్యంగా ఉంచుతున్నారని అంటున్నరు.  సాధారణంగా సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి విదేశాలకు వెళ్లినప్పుడు.. ఎన్నారైలు, ఆ పార్టీకి సంబంధించిన ఎన్నారై విభాగాలు ఆయన్ను కలిసి మాట్లాడటం సహజం. అయితే సీఎం జగన్ పర్యటనలో అలాంటి కార్యక్రమాలు పెట్టుకోలేదు.