CM YS Jagan Meeting: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకొని వచ్చిన వెంటనే గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ముగింపుపై ఒక స్పష్టత ఇవ్వనున్నారు. అలాగే రాబోయే ఎన్నికల కోసం పార్టీ తరఫున చేపట్టబోయే కొత్త కార్యక్రమంపై ప్రకన చేసేందుకు ఎమ్మెల్యేలు, నియోజక వర్గ బాధ్యులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈనెల 11వ తేదీన రాత్రి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లండన్ నుంచి తిరిగి రాష్ట్రానికి రానున్నారు. ఆయన వచ్చాక పార్టీ ఎమ్మెల్యేలు, ఇంఛార్జీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. అయితే ఈనెల ఒకటవ తేదీనే ఈ సమావేశం నిర్వహించాలనుకున్నప్పటికీ.. 2వ తేదీ నుంచి సీఎం జగన్ లండన్ పర్యటన ఉండడంతో హడావుడి అవుతుందని భావించి వాయిదా వేశారు. అయితే ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారా లేదా అనే దానిపై మాట్లాడనున్నారు. 


ఎమ్మెల్యేలు, నియోజవర్గ ఇంఛార్జీలతో సీఎం సమావేశం


చాలా మంది ఎమ్మెల్యేలు ఇంకా వారి నియోజ కవర్గాల్లో ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని పూర్తి చేయలేదని తెలుస్తోంది. రెండు, మూడు వారాల సమయం దొరికితే వారిలో కొంత మంది అయినా పూర్తి చేయగలరనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించాలనుకున్నారు. ఎమ్మెల్యేలలతో పాటు ఇంఛార్జీలు వారి నియోజక వర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ఎంత మంది పూర్తి చేశారనే దానిపై ఐ ప్యాక్‌ సంస్థ ప్రతినిధులు ఇప్పటికే నివేదికలు సిద్ధం చేశారు. మరోవైపు పార్టీ ప్రాంతీయ సమన్వయ కర్తలు, సామాజిక మాధ్యమ బృందాలు, విజిలెన్స్‌ ఇలా పలు కోణాల్లో నివేదికలు సిద్ధం చేయించారు. వీటన్నింటినీ క్రోడీకరించి తుది నివేదికను సమావేశంలో సీఎం ప్రకటించనున్నారు. 


కొత్త కార్యక్రమానికి ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం


అయితే దీని ఆధారంగానే ఏయే ఎమ్మెల్యేలు గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో సరిగ్గా తిరగలేదనేది తేల్చి చెప్పబోతున్నారు. తిరగని వారి స్థానంలో ఆయా నియోజక వర్గాలకు కొత్తగా పార్టీ సమన్వయకర్తలను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఈ నెలతో ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని అధికారికంగా నిలిపి వేయబోతున్నట్లు సమాచారం. అలాగే రాబోయే ఎన్నికలకు పార్టీ తరఫున చేపట్టబోయే కొత్త కార్యక్రమానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. 


కేంద్రం నిర్ణయానికి అనుగుణంగానే


రాష్ట్రంలో ఎన్నికలతో పాటుగా దేశ వ్యాప్తంగా జరిగే ఎన్నికలపై కూడా ఇప్పడు పెద్ద చర్చే జరుగుతుంది. ఎన్నికలకు సంబంధించిన వ్యవహరంలో కేంద్రం తీసుకునే నిర్ణయానికి వైఎస్ఆర్ సీపీ కూడా కట్టుబడి ఉంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. అందులో భాగంగానే జమిలి ఎన్నికలు జగన్ సై అంటారని,  విదేశీ పర్యటన నుంచి తిరిగొచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పార్టీ వర్గాలతో ప్రత్యేకంగా సమావేశం జరుగుతుందని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడు నెలలు సమయం ఉంది. అయినప్పటికి ఎడాది ముందు నుంచే ఎన్నికలకు సంబందించిన ఫీవర్ రాష్ట్రంలో పెరిగిపోయింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధంతో పాటుగా, దాడులు, ప్రతి దాడులు కూడా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా అవసరం అయితే ముందుగానే ఎన్నికలకు వెళ్లేందుకు కూడా అవకాశాలు లేకపోలేదనే ప్రచారం కూడా పార్టీ లో జరుగుతుంది.