Air Hostess Murder: ముంబయిలో ఎయిర్ హోస్టెస్ రూపాల్ ఓగ్రే హత్య కేసులో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. రూపాల్ ఓగ్రేను హత్య చేసిన నిందితుడు విక్రమ్ అత్వాల్.. అంధేరీ పోలీసు స్టేషన్ లో మృతి చెంది కనిపించాడు. లాకప్ లో ప్యాంటుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. శుక్రవారం ఉదయం అంధేరి పోలీస్ స్టేషన్ లాకప్ లోని టాయిలెట్‌లోకి ప్రవేశించిన నిందితుడు విక్రమ్ అత్వాల్.. ఎన్నిసార్లు పిలిచినా స్పందించకపోవడంతో అనుమానం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే టాయిలెట్ తలుపులు పగులగొట్టి చూడగా ఉరి వేసుకుని కనిపించినట్లు పోలీసులు వెల్లడించారు.
ముంబయిలోని మరోల్ ఏరియాలో నివాసం ఉంటున్న ట్రైనీ ఎయిర్ హోస్టెస్ రూపాల్ ఓగ్రే మూడ్రోజుల క్రితం తన నివాసంలో విగత జీవిగా కనిపించింది. ఎయిర్ హోస్టెస్ మృతి చెందిన సమయంలో విక్రమ్ అత్వాల్ కదలికలు అనుమానాస్పదంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతడి ముఖం, చేతులపై గాయాలు కూడా కనిపించాయి. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా.. అతడే నిందితుడని తేలింది. దాంతో విక్రమ్ అత్వాల్ ను అరెస్టు చేసి మంగళవారం అంధేరీ కోర్టులో హాజరు పరిచారు. కోర్టు విక్రమ్ కు ఈ రోజు వరకు పోలీసు కస్టడీ విధించింది. ఈ రోజుతో కస్టడీ ముగియడంతో అతడిని కోర్టు ముందు హాజరు పర్చాల్సి ఉండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది. విక్రమ్ అత్వాల్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడి భార్య కూడా అదే అపార్ట్‌మెంట్ లో పని చేస్తోంది.
మృతురాలు రూపాల్ ఓగ్రే ఛత్తీస్ గఢ్ కు చెందినవారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఆమె ఎయిరిండియాకు ఎంపిక అయ్యారు. ఎయిరిండియాలో శిక్షణ కోసం ముంబయికి వచ్చిన రూపాల్.. అంధేరిలోని ఒక హౌజింగ్ సొసైటీలో తన సోదరి, మరో ఫ్రెండ్ తో కలిసి నివాసం ఉంటున్నారు. అయితే వారం రోజుల క్రితం తన సోదరి, మరో ఫ్రెండ్ ఇద్దరూ వారి స్వగ్రామాలకు వెళ్లిపోయారు. దీంతో ఫ్లాట్ లో రూపాల్ ఓగ్రే ఒంటరిగా ఉంటున్నారు. రూపాల్ ఓగ్రే ఆదివారం ఉదయం ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడారు. అదే ఆఖరి సారి ఆ తర్వాత రూపాల్ కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు.
దీంతో వారు కంగారు పడుతూ ముంబయిలోని ఆమె స్నేహితులను సంప్రదించారు. దీంతో వారు రూపాల్ ఓగ్రే నివాసం ఉంటున్న ఫ్లాట్ వద్దకు వెళ్లి చూడగా.. ఫ్లాట్ లాక్ వేసి కనిపించింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. అలా అక్కడికి చేరుకున్న పోలీసులు.. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా.. రక్తపు మడుగులో పడి ఉన్న రూపాల్ ఓగ్రే మృతదేహం కనిపించింది. వెంటనే ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కానీ రూపాల్ ఆపాటికే ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అదే హౌజింగ్ సొసైటీలో స్వీపర్ గా పని చేస్తన్న 40 ఏళ్ల విక్రమ్ అత్వాల్ ను అరెస్టు చేశారు.