TDP Ex MLA Yarapathineni: గురజాల: తాను చివరి శ్వాస వరకూ తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని ఆ పార్టీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. అధికార పార్టీ వైసీపీ (YSRCP) నేతలు వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే తనపై దుష్ప్రచారం చేస్తుందంటూ గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని (Yarapathineni Srinivasa Rao) మండిపడ్డారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, అవన్నీ వదంతులేనని కొట్టిపారేశారు. 


టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్నాను.. 
తెలుగుదేశం ఆవిర్భావం నుంచి తమ కుటుంబం టీడీపీలోనే కొనసాగుతుందన్నారు. పలుమార్లు గురజాల నుంచి పోటీ చేసే అవకాశాన్ని పార్టీ తనకు కల్పించిందన్నారు. చివరిశ్వాస వరకూ టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఒక అబ్బకు, అమ్మకు పుట్టిన వాళ్లైతే ఇకనుంచి తన గురించి దుష్ప్రచారం చేయవద్దని.. పార్టీ మార్పు వదంతులు వ్యాప్తి చేస్తున్న వారిని హెచ్చరించారు. 


వైసీపీ అనుకూల మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు.. 
వైసీపీ అనుకూల మీడియాలో టీడీపీ నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారని యరపతినేని ఆరోపించారు. టీడీపీకి పిల్లర్స్ గా ఉన్న తన లాంటి నేతలు వైసీపీలో చేరుతున్నారని ప్రచారం చేసి, మానసికంగా దెబ్బతీయాలని చూశారని ఆరోపించారు. ఆ సోషల్ మీడియాలో పనిచేసేవాళ్లు, వైసీపీ నేతలు గురజాల నుంచి వరుసగా ఏడు సార్లు టీడీపీ నుంచి పోటీ చేశానన్నారు. దివంగత ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు, నారా లోకేష్ వరకు తనకు ఎప్పుడూ మద్దతుగా నిలిచారని చెప్పారు. 


వెంట్రుక కూడా అంటూ వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ 
గతంలో తాను సీఎం జగన్ పై ఎన్నో ఆరోపణలు చేశానన్నారు. వాటిని దృష్టిలో ఉంచుకుని తాను పార్టీ మారుతున్నానంటూ దుష్ప్రచారం చేస్తున్నారంటూ యరపతినేని మండిపడ్డారు. చనిపోయే వరకూ టీడీపీలోనే కొనసాగుతాను.. చనిపోతే సైతం తనపై టీడీపీ జెండా కప్పాలన్నారు. వైసీపీ నేతలుగానీ, జగన్ గానీ తన వెంట్రుక కూడా పీకలేరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పనికి మాలిన రాజకీయాలు చేయడం ఇకనైనా మానుకుంటే మంచిదంటూ వార్నింగ్ ఇచ్చారు.