ED Case On YSRCP Mla :  వైసీపీ సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారుడు, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు అయింది. గురువాయూర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ జీఐపీఎల్ కంపెనీ డైరెక్టర్ గా మేకపాటి విక్రమ్ రెడ్డి ఉన్నారు. ఈ కంపెనీ  కృష్ణ మోహన్ కన్‌స్ట్రక్షన్స్‌ కేఎంసీ అనే కంపెనీ అనుబంధ సంస్థ. ఇది మేకపాటి కుటుంబానికి చెందినది. కేరళలో ఓ జాతీయ రహదారి నిర్మాణం కోసం అనుబంధ సంస్థ జీఐపీఎల్ ను ఏర్పాటు చేశారు. రోడ్ పూర్తిగా నిర్మించకుండా.. బస్ షెల్టర్లు కట్టకుండానే టోల్, ప్రకటన చార్జీల రూపంలో భారీగా డబ్బులు సంపాదించినట్లుగా ఈ కంపెనీపై ఆరోపణలుఉన్నాయి.                                         


కోల్‌తాలోని భారత్ రోడ్ నెట్‌వర్క్ లిమిటెడ్, , త్రిసూర్‌లోని జీఐపీఎల్ కార్యాలయాల్లో సోదాలను నిర్వహించారు. డాక్యుమెంట్లను పరిశీలించిన అనంతరం ఈ చీటింగ్ కేసు నమోదు చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ సోదాలు చేపట్టారు. మేకపాటి విక్రమ్ రెడ్డి స్వయంగా నేర పూరిత కుట్రకు పాల్పడ్డారని  ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగా ఎన్‌హెచ్ఏ1 నిధులు దుర్వినియోగం చేశారని ఈడీ కేసు నమోదు చేసింది. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు విచారణ చేపట్టారు. 2006లో ఎన్ హెచ్47లోని పనుల అమలుకు సంబంధించి అక్రమాలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. 


ఎన్‌హెచ్ఏ1 పాలక్కాడ్‌లో అధికారులతో కలిసి కుట్రలు చేశారు. రోడ్డు నిర్మాణం పూర్తయినట్లు అధికారులతో ధృవీకరణ పత్రాన్ని పొంది మోసం చేశారు. ప్రజల నుంచి అక్రమంగా టోల్ వసూలు ద్వారా రూ.125 కోట్ల మేర లబ్ధిపొందినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. విక్రమ్ రెడ్డి ఇంట్లో లభ్యమైన నగదును పీఎంఎల్ఏ 202 సెక్షన్ 17 (1-A)కింద సీజ్ చేశారు. 2006 నుంచి 2016 మధ్యకాలంలో కేరళలోని పాలక్కాడ్‌లో 47వ జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించిన రెండు సెక్షన్ల నిర్మాణ పనుల్లో మేకపాటి విక్రమ్ రెడ్డి అవకతవకలకు పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ. దీనివల్ల ఎన్‌హెచ్ఏఐకి సుమారు 102 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని ఈడీ అధికారులు అంచనా వేశారు.                                                    
 
కేసు నమోదు చేయడానికి ముందు ఈడీ అధికారులు హైదరాబాద్‌లోని కేఎంసీ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగానే ఈ చీటింగ్ కేసు నమోదు చేశారని అంటున్నారు. దీనిపై  కంపెనీ యాజమాన్యానికి నోటీసులను జారీ చేస్తారని తెలుస్తోంది. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి.. సాక్ష్యా ధారాలను కూడా సేకరించినందుకున మేకపాటి విక్రమ్ రెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేయవచ్చన ప్రచారం జరుగుతోంది.