Pawan Kalyan :   జనసేన అధినేత పవన్ కల్యాణ్ కర్ణాటకలో బీజేపీ తరపున ప్రచారం చేస్తారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. పవన్ ఇటీవలి ఢిల్లీ పర్యటనలో ఈ మేరకు అంగీకారం తెలిపారని .. సమన్వయం చేసుకునే బాధ్యతను ఎంపీ, బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు తేజస్వి సూర్యకు అప్పగించారని అనుకున్నారు. అయితే నామినేషన్ల గడువు ముగిసినా పవన్ కల్యాణ్ ప్రచారం గురించి క్లారిటీ రాలేదు. తేజస్వి సూర్య సంప్రదిస్తున్నా పవన్ కల్యాణ్ స్పందించడం లేదని చెబుతున్నారు. బీజేపీ కి ప్రచారం చేసే విషయంలో పవన్  
కల్యాణ్ ఆసక్తిగా లేరని బీజేపీ వర్గాలు అంచనాకు  వస్తున్నాయి. 


కర్ణాటక బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర అవినీతి ఆరోపణలు


కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం పై ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. అదే సమయంలో వ్యతిరేకత కూడా ఎక్కునగానే ఉందన్న ప్రచారం జరుగుతోంది. సర్వేలన్నింటిలోనూ కాంగ్రెస్‌ పార్టీనే గెలుస్తుందన్న  అంచనాలు వస్తున్నాయి. దీంతో పవన్ కల్యాణ్  బీజేపీకి ప్రచారం చేసే విషయంలో పెద్దగా ఆసక్తి చూపించడం లేదని చెబుతున్నారు.  గతంలో కూడా పవన్ బీజేపీకి ప్రచారం చేయలేదు. కర్ణాటకలో పవన్ కల్యాణ్‌కు పెద్ద ఎత్తు న ఫాలోయింగ్ ఉంది. ఆయన ప్రచారానికి వస్తే జనం విపరీతంగా వస్తారు. ఆయన స్పీచ్‌లు తెలుగు ఓటర్ల మీద ప్రభావం చూపిస్తాయి. కర్ణాటకలో స్థిరపడిన తెలుగు ఓటర్లను ఆకట్టుకోవాలంటే పవన్ లాంటి స్టార్ అవసరం అని గట్టిగా నమ్ముతున్నారు. కానీ పవన్ మాత్రం ఆసక్తి చూపించడం లేదు. 


పవన్ ను స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పెట్టని బీజేపీ !


కర్ణాటకలో బీజేపీ తరపున  ప్రచారం చేసే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బీజేపీ రిలీజ్ చేసింది. అందులో పవన్ కల్యాణ్‌కు చోటు దక్కలేదు. తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైకి చోటు కల్పించారు. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు స్టార్ క్యాంపెయినర్ జాబితాలో చోటు కల్పించారు. ఇప్పటికే డీకే అరుణ కర్ణాటక సహ ఇన్ చార్జీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  కర్ణాటక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. కొద్దిరోజులుగా పూర్తిగా కర్ణాటకకేలోనే ఉంటున్నారు.  ఇక స్టార్ క్యాంపెయినర్లలో పేర్కొన్న వారంతా మే 10 జరగబోయే ఎన్నికల కోసం కాషాయ పార్టీ తరపున ప్రచారంలో పాల్గొననున్నారు. అయితే ఈ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో బీజేపీ నేతలే ఉన్నారు. మిత్రపక్షాల నేతలు లేరు. పవన్ ఒప్పుకుంటే ఈసీ నుంచి ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకుంటారు 


పవన్ బెట్టు చేస్తున్నారా ?


బీజేపీ తరపున ప్రచారం చేయడానికి పవన్ కల్యాణ్ ఆసక్తికరంగానే ఉన్నప్పటికీ .. ఏపీలో రాజకీయ పరిణామాల విషయంలో తమ ప్రతిపాదనలు పట్టించుకోనందున పవన్ బెట్టు చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.  వైసీపీ విముక్త ఏపీ లక్ష్యమని.. నిబంధనలకు విరుద్ధంగా వైసీపీకి సహకరించడం ఆపేయాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే బీజేపీ మాత్రం ఏపీ ప్రభుత్వానికి..సీఎం జగన్ కు ఎప్పుడు అవసరం అయితే అప్పుడు ఇస్తూ వస్తోంది. ఇలాంటి పరిణామాలతో బీజేపీకి వైసీపీనే దగ్గర అని.. ఇక తాను ప్రచారం చేయాల్సిన అవసరం ఏముందని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా పవన్ కల్యాణ్ కర్ణాటక లో  ప్రచారంపై ప్రతిష్ఠంభన  ఏర్పడింది.