Why is Jagan not visiting liquor scam accused: అధికారం పోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలంతా వివిధ కేసుల్లో జైలుకు వెళ్తున్నారు. వల్లభనేని వంశీ నుంచి కాకాణి గోవర్ధన్ రెడ్డి వరకూ చాలా మంది నేతలు జైళ్లకు వెళ్లారు. వారందర్నీ జగన్ ఆయా జైళ్లకు వెళ్లి పరామర్శించారు. పోసాని వంటి కొంత మందిని పరామర్శించలేదు. అదే సమయంలో లిక్కర్ స్కామ్ లో అరెస్టయిన వారెవర్నీ పరామర్శించలేదు. ఈ కేసులో అరెస్టు అయిన వారందరూ జగన్‌కు అత్యంత సన్నిహితులే.        

మిథున్ రెడ్డినీ పరామర్శించని జగన్                

మిథున్ రెడ్డి ..  వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆయనకు లిక్కర్ కేసుతో ఏం సంబంధం లేదని జగన్ పలుమార్లు ప్రెస్మీట్లలో చెప్పారు. అయితే సుప్రీంకోర్టులోనూ ఊరట లభించకపోవడంతో చివరికి రాజంపేట ఎంపీ అరెస్టు కావాల్సి వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకూ ఆయనను పరామర్శించలేదు. ఇరవై ఐదో తేదీన జగన్ .. మిథున్ రెడ్డిని పరామర్శించేందుకు రాజమండ్రి వస్తారని బొత్స సత్యనారాయణ ప్రకటించారు. కానీ ఒక్క రోజులోనే ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ అయినట్లుగా బొత్స ప్రకటించారు. 

తన వద్ద పని చేసిన అధికారలనూ పరామర్శించలేదు !                  

ఇక జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా పని చేసిన రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిలను కూడా జగన్ పరామర్శించలేదు. వారిద్దరూ జగన్ కు అత్యంత సన్నిహితులు. ధనుంజయ్ రెడ్డి.. జగన్ సీఎంగా ఉన్న ఐదు సంవతర్సాల పాటు సీఎంవోలో చక్రం తిప్పారని అంటారు. అన్ని పనులు ఆయన చేతుల మీదుగానే జరిగేవని చెబుతారు. అలాంటి ధనుంజయ్ రెడ్డి అరెస్టు అయినా జగన్.. జైలుకు వెళ్లి పరామర్శించలేదు. కృష్ణమోహన్ రెడ్డి కూడా జగన్‌కు సన్నిహితులే. వీరిని కూడా ఎందుకు పట్టించుకోవడం లేదన్న ప్రశ్నలు వస్తున్నాయి. 

లిక్కర్ కేసు నిందితుల్ని పరామర్శించకపోవడం వెనుక వ్యూహం ఉందా ?                

లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. సిట్ దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్‌లో జగన్ ప్రస్తావన ఉంది. అసలు ఈ లిక్కర్ స్కామ్‌లో అంతిమ లబ్దిదారుడు జగన్మోహన్ రెడ్డేనని సిట్ చెబుతోంది. ఇలాంటి సమయంలో లిక్కర్ కేసు నిందితుల్ని పరామర్శించకపోవడం వెనుక ప్రత్యేక వ్యూహం ఉందంటున్నారు. వారిని పరామర్శిస్తే అందరూ కలిసి ప్లాన్ చేశారని.. అందుకే వారి కోసం  జైలుకు వచ్చారని ప్రచారం జరిగే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. లాయర్లు, న్యాయనిపుణుల సూచనల మేరకే జగన్.. తనకు అత్యంత ఆత్మీయులు అయినప్పటికీ లిక్కర్ కేసు నిందితుల్ని జైలుకు వెళ్లి పరామర్శించడం లేదని చెబుతున్నారు. 

అయితే టీడీపీ నేతలు మాత్రం జగన్మోహన్ రెడ్డి అందర్నీ బలి చేసి తాను తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు.