ఏపీలో వాలంటీర్లు అక్కడక్కడా తమ అసంతృప్తి స్వరం వినిపిస్తున్నారు. ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని కూడా కొన్నిచోట్ల బహిష్కరించారు. అయితే అంగన్వాడీ సమ్మెలాగా ఇది రాష్ట్రమంతా విస్తరించలేదు. కొన్ని జిల్లాల్లో, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వాలంటీర్లు తమ అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు. ఆందోళనలకు దిగుతున్నారు. 


వాలంటీర్ల డిమాండ్లు ఏంటి..?
జీతం విషయంలో గతంలోనే వాలంటీర్లు పెద్ద ఉద్యమం చేశారు, అయినా ఫలితం లేదు. అది ఉద్యోగం కాదని, సేవ అని తేల్చి చెప్పారు జగన్. వాలంటీర్లకు నగదు అవార్డులు ప్రకటించి వారిని కాస్త శాంతపరిచారు. ఇటీవల వాలంటీర్లకు జీతాలు పెంచుతామని మంత్రి ప్రకటించినా అది అధికారికం అవునో కాదో తేలాల్సి ఉంది. ఈ దశలో వాలంటీర్లు ఆందోళనబాట పట్టారు. తమ జాబ్ చార్ట్ లోని విధులకంటే, ఎక్కువ పనులు చేయించుకుంటున్నారని అంటున్నారు. అన్ని పనులకు తమనే వినియోగిస్తున్నారని తమపై అనవసర ఒత్తిడి పెరిగిపోతోందనేది వారి వాదన. జాబ్ చార్ట్ ప్రకారమే తమకు విధులు కేటాయించాలనేది వారి ప్రధాన డిమాండ్. 


ప్రభుత్వాన్నే వ్యతిరేకిస్తారా..?
అసలు వాలంటీర్ అనే పోస్ట్ లు సృష్టించింది సీఎం జగన్. అలాంటిది ఆయన్నే వాలంటీర్లు వ్యతిరేకిస్తారా అనేది అనుమానమే. ఒకవేళ టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ల పోస్ట్ లు ఉంటాయో ఊడతాయో ఎవరికీ తెలియదు. ఈ దశలో వారు జీతాల కోసం డిమాండ్ చేసి జగన్ కి వ్యతిరేకంగా పని చేస్తారని ఊహించలేం. ఒకవేళ అదే నిజమైతే అది జగన్ స్వయంకృతాపరాధమేనని చెప్పాలి అంటున్నారు విశ్లేషకులు. వాలంటీర్ ఉద్యోగాలిచ్చి, వారికి గౌరవ వేతనం ఇచ్చి, క్యాష్ అవార్డులు ఇస్తూ, పేపర్ బిల్లులు చెల్లిస్తూ, స్మార్ట్ ఫోన్లు ఇచ్చినా కూడా వారు జగన్ కి వ్యతిరేకంగా మారారంటే అది ఆయన చేసిన తప్పే అనుకోవాలి అంటున్నారు.  


వాలంటీర్లపై వైసీపీ నేతలకు కూడా పెద్దగా గౌరవం లేదనే విషయం ఇటీవల పలు సందర్భాల్లో బయటపడుతోంది. వారిని ప్రజల సేవకులుగా కాకుండా పార్టీ కార్యకర్తల్లా చూస్తున్నారు నేతలు. పార్టీ వ్యవహారాలను కూడా వారికి అప్పగిస్తున్నారు. ఎక్కడ ఏ పార్టీ మీటింగ్ జరిగినా వాలంటీర్లకు కూడా జన సమీకరణ బాధ్యతలు అప్పగిస్తున్నారు. పైగా ఇటీవల వాలంటీర్లకు పోటీగా గృహసారథులను కూడా రంగంలోకి దింపారు. తాజాగా తంబళ్లపల్లి వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ గా మారాయి. వాలంటీర్లు జీతాలు పెంచలేదంటున్నారని, వారి కష్టానికి తగ్గ ఫలితం దక్కలేదని బాధపడుతున్నారని.. వారు బాధ పడాల్సిన అవసరం లేదన్నారు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి. అసలు వారికి ఉద్యోగం వచ్చిందే గొప్ప అని తేల్చి చెప్పారు. వాలంటీర్లు జీతం కోసం కాకుండా గౌరవం కోసం పని చేయాలని సలహా ఇచ్చారు. వాలంటీర్లతో తమ సొంత పనులేమీ చేయించడం లేదు కదా అని ప్రశ్నించారు. అసలు వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు కలసి ఏమేం చేస్తున్నారో అందరికీ తెలుసని, అయినా తాము పట్టించుకోవడం లేదు కదా అని చెప్పారు. వాళ్లు పనిచేయకపోతే.. కష్టపడేవారే దొరకరా అంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. 


మొత్తానికి వాలంటీర్ల వ్యవహారం కాస్త చినికి చినికి గాలివానలా మారేలా ఉంది. ఏపీలో గ్రామ, వార్డు వాలంటీర్లెవరూ 5వేల జీతంతో సంతృప్తిగా లేరు. అదే సమయంలో జీతం విషయంలో ప్రభుత్వం కచ్చితంగా ఉండటంతో పనుల విషయంలో కూడా వారు లైట్ తీసుకుంటున్నారు. సామాజిక పెన్షన్ల విషయంలో మాత్రం వారు కచ్చితంగా సమయపాలన పాటిస్తున్నారు. ఒకవేళ వాలంటీర్ వ్యవస్థ అసంతృప్తిలో ఉంటే మాత్రం కచ్చితంగా వైసీపీకి నష్టం జరుగుతుందనే చర్చ నడుస్తోంది.