NDA In AP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అస్పష్టత ఉంది. అందరు చూపు బీజేపీ వైపే ఉంది. బీజేపీ ఓటు బ్యాంక్ ఉపయోగపడుతుందని ఎవరూ అనుకోవడం లేదు కానీ.. ఆ పార్టీ తల్చుకుంటే ఎన్నికల్ని ఫ్రీ అండ్ ఫెయిర్‌గా నిర్వహించగలదని.. అదే ఫలితాలకు కీలకమని ఎక్కువ మంది నమ్ముతున్నారు. అందుకే ఆ పార్టీ ఎటు వైపు మొగ్గుతుందన్నది కీలకంగా మారింది. ఇలాంటి సమయంలో ఏపీకి వచ్చిన జేపీ నడ్డా, అమిత్ షా అధికార పార్టీపై ఘాటు విమర్శలు చేశారు. అమిత్ షా ..త ఎన్డీఏకు ఏపీలో 20 సీట్లు ఇవ్వాలని ప్రజల్ని కోరారు. అక్కడే బీజేపీ అగ్రనేత ఏపీలో పొత్తులపై హింట్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. 


ఎన్డీఏ పక్షాలకు ఏపీలో 20 సీట్లు ఇవ్వాలన్న అమిత్ షా 
 
ఏపీలో పొత్తులపై అమిత్ షా విశాఖలో పరోక్షంగా సంకేతాలు ఇచ్చి వెళ్లారని భావిస్తున్నారు.  విశాఖలో నిర్వహించిన జన సంపర్క అభియాన్ బహిరంగసభలో మాట్లాడిన ఆయన… ఎన్డీఏ పక్షాలకు ఇరవై సీట్లను ఇవ్వాలని ప్రజలను కోరారు. మామూలుగా ఒంటరిగా పోటీ చేయాలనుకుంటే … బీజేపీకి ఇరవై సీట్లు ఇవ్వాలని కోరేవారు. అయితే ఎన్డీఏ అని ప్రత్యేకంగా చెప్పడంతో కొత్త పొత్తులపై అమిత్ షా సంకేతాలు ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి ఇప్పటికీ బీజేపీతో జనసేన పొత్తు అధికారికంగా ఉంది. రెండుపార్టీలు పొత్తులో ఉన్నామని చెప్పుకుంటున్నాయి. కానీ ఎవరూ కలవడం లేదు. రాష్ట్ర బీజేపీ నేతల తీరుపై పవన్ అసంతృప్తిగా ఉన్నారు. వారితో కలిసి పని చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. అందుకే పొత్తులోనే ఉన్నా ఎవరి రాజకీయం వారు చేస్తున్నారు. 


ఏపీ ఎన్డీఏలో ఏ ఏ పార్టీలు ఉంటాయి ? 


అమిత్ షా కూడా ఎన్డీఏ అన్నారు కానీ బీజేపీ, జనసేన కూటమికి అనలేదు. అసలు జనసేన ప్రస్తావన తీసుకు రాలేదు. ఇటీవలి కాలంలో ఎన్డీఏలోకి కొత్త పార్టీలను తీసుకు రావాలని అమిత్ , షా మోదీ గట్టిగా ప్రయత్నిస్తున్నారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.  వదిలి పెట్టి వెళ్లిపోయిన పార్టీలను మళ్లీ ఆహ్వానిస్తున్నారని అంటున్నారు. వ్యవసాయ చట్టాల కు వ్యతిరేకంగా కూటమి నుంచి వెళ్లిపోయిన అకాలీ దళ్ మళ్లీ బీజేపీతో జత కట్టేందుకు సిద్ధంగా ఉంది. దక్షిణాది నుంచి టీడీపీ, జేడీఎస్ వంటి పార్టీలను ఆహ్వానిస్తున్నట్లుగా చెబుతున్నారు. మొత్తంగా ఏపీలో ఎన్డీఏ ప్రస్తావన తీసుకు రావడంతో బీజేపీ కొత్త పొత్తుల గురించి విస్తృత ప్రచారం జరుగుతున్నట్లుగా రాబోయే రోజుల్లో కొత్త పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.
 
ఎన్డీఏలో చేరేందుకు జగన్ సిద్ధమయ్యారన్న ప్రచారం !


గతంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత .. వైఎస్ఆర్‌సీపీ ఎన్డీఏలో చేరేందుకు అంగీకారం తెలిపిందన్న ప్రచారం జరిగింది. టీడీపీని కూటమిలో చేరకుండా అడ్డుకోవడానికి జగన్ ఈ ఆఫర్ ఇచ్చారని చెప్పుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో భేటీ అయ్యారు. దీంతో రెండు పార్టీల్లో ఏదో ఒకటి ఎన్డీఏలో చేరడం ఖాయమని చెబుతున్నారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంపై అమిత్ షా, జేపీ నడ్డా తీవ్ర విమర్శలు చేయడంతో ఎన్డీఏలో చేర్చుకునే ఆలోచన లేకపోవడంతోనే అలాంటి విమర్శలు చేశారని భావిస్తున్నారు.