Anantapuram Politics :  ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి పెరుగుతూండటంతో సీనియర్ నేతలపై అందరి దృష్టి పడింది. అనంతపురం జిల్లాలో ఇద్దరు మాజీ పీసీసీ అధ్యక్షులు ఉన్నారు. వారు ఏ పార్టలో చేరుతారన్నదానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికైతే వారు కాంగ్రెస్ లో ఉన్నారు. కాంగ్రెస్ తరపున పోటీ చేస్తే గెలుస్తామన్న నమ్మకం లేదు. అందుకే వారు ఇతర పార్టీల వైపు చూస్తున్నారని చెబుతున్నారు. కానీ వారు మాత్రం గుంభనంగానే రాజకీయాలు చక్క బెడుతున్నారు.  


సైలెంట్ గానే ఉన్న రఘువీరారెడ్డి 
 
రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెసు పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో పూర్తిగా దెబ్బతింది. పీసీసీ అధ్యక్ష బాధ్యతలను తీసుకుని పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు  రఘువీరారెడ్డి ప్రయత్నించారు. కానీ ప్రయోజనం లేకపోియంది.  2014, 2019 ఎన్నికల్లోనూ ఉమ్మడి జిల్లాలో పెనుకొండ, కళ్యాణదుర్గంలోనూ ఆయన పోటీ చేసినప్పటికీ కాంగ్రెసుపై ఉన్న వ్యతిరేకతతో ఓటమిని చవిచూడక తప్పలేదు. 2019 ఎన్నికల తరువాత నుంచి పిసిసి పదవి నుంచి కూడా తప్పుకుని రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే ఇటీవల జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెసు పార్టీ తరపున అక్కడ ప్రచారం చేశారు. తిరిగి ఆయన యాక్టివ్‌ అయ్యారని భావించారు. కాని ఇప్పటికీ రాష్ట్ర రాజకీయాల పట్ల మాత్రం మౌనంగానే ఉంటూ వస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోపు అయినా ఇక్కడి రాజకీయాల వైపు దృష్టి సారిస్తారా లేక దూరంగానే ఉంటారా అన్నది క్లారిటీ లేదు. 


మరో పీసీసీ మాజీ చీఫ్ శైలజానాథ్ దారెటు ? 


 రఘువీరారెడ్డి పిసిసి అధ్యక్షతల నుంచి తప్పుకున్న తరువాత మాజీ మంత్రి డాక్టర్‌ సాకే శైలజనాథ్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. ఆయన 2004లో వైద్యవృత్తిని వదిలి రాజకీయరంగ ప్రవేశం చేశారు. 2012లో కాంగ్రెసు పార్టీ హయంలోనే విద్యా శాఖ మంత్రి అయ్యారు.  మొన్నటి వరకు ఆయన పిసిసి అధ్యక్షులుగా ఉంటూ వచ్చారు. కాని ఇటీవల ఆయన స్థానంలో గిడుగు రుద్రరాజును నియమించారు. అప్పటి నుంచి ఆయన కొంత వరకు కాంగ్రెసుకు దూరంగా జరుగుతున్నారన్న ప్రచారం రాజకీయవర్గాల్లో నడుస్తోంది. ఇక రాష్ట్రంలో కాంగ్రెసు ఇప్పట్లో పుంజుకునే పరిస్థితి లేదన్న ఉద్ధేశంతో ఇతర పార్టీల వైపు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన పూర్వపు నియోజకవర్గమైన శింగనమలలో ఇటీవలి కాలంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. 


టీడీపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం! 


శింగనమల నియోజకవర్గంలో తనకు ఉన్న పరిచయాలతో ముఖ్యమైన వారిని గ్రామాల వారీగా కలుస్తూ, వచ్చే ఎన్నికల్లో తనకు సహకారం అందివ్వాలని కోరుతున్నారు. అయితే ఏ పార్టీ తరపున అన్నది స్పష్టంగా వారికి మాత్రం చెప్పడం లేదు. అయితే ఆయన తెలుగుదేశం పార్టీలోకి త్వరలో చేరే అవకాశముందన్నది మాత్రం ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ మేరకు ఇటీవల కాలంలో ఆయన ఆ పార్టీ ముఖ్య నేతలతో మంతనాలు జరిపారన్న ప్రచారమూ ఉంది. జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఆయనతో చర్చలు జరిపారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో ఆ నియోజకవర్గంలో గ్రూపు తగాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటిని చెక్‌ పెట్టేందుకు ఆయన్ను తీసుకొస్తే బాగుంటుందన్న ఆలోచనలోనూ తెలుగుదేశం పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది.