What did Pawan and Chandrababu discuss in the meeting: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన భేటీ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఉండవల్లిలోని సీఎం నివాసంలో దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన ఈ ఏకాంత సమావేశంలో పలు కీలక అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. ప్రధానంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ ప్రాధాన్యతలు, కూటమి పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో ఉండాల్సిన సమన్వయంపై ఇరువురు నేతలు చర్చించినట్లుగా తెలుస్తోంది.
సీఎం, డిప్యూటీ సీఎంల సమావేశంలో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం ప్రధానంగా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై సిట్ విచారణ పురోగతి, దోషులను కఠినంగా శిక్షించేలా ప్రభుత్వం తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై నేతలిద్దరూ చర్చించినట్లుగా తెలుస్తోంది. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని, క్షేత్రస్థాయిలో భక్తులకు వాస్తవాలు వివరించేలా ఉమ్మడి కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే, విపక్షాలు కుల రాజకీయాలతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని, అటువంటి ట్రాప్ లో పడకుండా కూటమి నేతలు అప్రమత్తంగా ఉండాలని బాబు-పవన్ ఓ నిర్ణయానికి వచ్చారు.
రానున్న రాజ్యసభ ఎన్నికల అంశంపైనా చర్చించినట్లుగా తెలుస్తోంది. ఏపీలో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాల భర్తీపై ప్రాథమికంగా చర్చలు జరిగాయి. కూటమిలోని మూడు పార్టీల బలాబలాల ప్రకారం సీట్ల కేటాయింపు ఎలా ఉండాలనే దానిపై అభిప్రాయాలు పంచుకున్నారు. ముఖ్యంగా జనసేన , బీజేపీలకు ఇచ్చే ప్రాధాన్యతపై చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియను త్వరలోనే పూర్తి చేసి, కార్యకర్తలకు న్యాయం చేయాలని నేతలు నిర్ణయించారు.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రచారం చేయబోతున్నారు. బీజేపీ తరపున రెండు రోజుల ప్రచారానికి పవన్ వెళ్లనున్నారు. ఈ క్రమంలో అక్కడ ప్రస్తావించాల్సిన అంశాలపైనా పవన్ కల్యాణ్ చర్చించినట్లుగా తెలుస్తోంది. రాజకీయపరంగా సున్నితమైన వ్యవహారం కావడం.. పవన్ డిప్యూటీ సీఎం హోదాలో ఉండటంతో చంద్రబాబు నుంచి కొన్ని సూచనలు తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఈ సమావేశం కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని, అత్యంత సమన్వయంతో ముందుకు వెళ్తున్నామనే సంకేతాన్ని పంపింది రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ వంటి అంశాలపై కూడా స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే నామినేటెడ్ పదవులు, రాజ్యసభ అభ్యర్థులకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
