what Is Skill Devolepment Scam  :   స్కిల్ డెలవప్‌మెంట్ శాఖలో భారీ స్కాం జరిగిందని 2021లోనే పోలీసులు కేసు నమోదు చేశారు.  రాష్ట్ర స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఏపీఎస్‌ఎస్‌డీసీ) నిధులు రూ. 241 కోట్లు కొల్లగొట్టారని అప్పట్లో సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో అప్పటి ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ–సీఈవో గంటా సుబ్బారావు, డైరెక్టర్‌గా వ్యవహరించిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి కె.లక్ష్మీ నారాయణ, ఎస్‌డీఈఐ కార్యదర్శికి ఓఎస్డీగా ఉన్న నిమ్మగడ్డ వెంకట కృష్ణ ప్రసాద్, ఇతర అధికారులు, సీమెన్స్, డిజైన్‌ టెక్, స్కిల్లర్, ఏఐసీ తదితర కంపెనీలకు చెందిన అప్పటి ఎండీలు, ఇతర ప్రతినిధులతో సహా మొత్తం 26 మందిపై సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. డిసెంబర్ 11, 2021న సీఐడీ గంటా సుబ్బారావును హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. దాదాపుగా ఇరవై రెండు నెలల తర్వాత ఇప్పుడు అదే కేసులో చంద్రబాబును అరెస్ట్ చేశారు. 


సీఐడీ ఆరోపణలు


2014–19లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యూనివర్సిటీలు, ఇంజినీరింగ్‌ కాలేజీలు కలిపి మొత్తం 40 చోట్ల ‘స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు’ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అందుకోసం రూ.3,611.05 కోట్లతో సీమెన్స్, డిజైన్‌టెక్‌ సంస్థలతో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఒప్పందం కుదుర్చుకుంది. సీమెన్స్, డిజైన్‌ టెక్‌ సంస్థ గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద 90 శాతం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులు సమకూర్చాలి. ఈ మేరకు 2017 జూన్‌ 30న జీవో 4ను టీడీపీ ప్రభుత్వం జారీ చేసింది.  కానీ జీవో 4కు విరుద్ధంగా ఒప్పందం చేసుకునేలా ఏపీఎస్‌ఎస్‌డీసీ డైరెక్టర్‌గా ఉన్న రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి కె.లక్ష్మీ నారాయణ, ఎండీ–సీఈవోగా ఉన్న గంటా సుబ్బారావు చక్రం తిప్పారని సీఐడీ ఆరోపించింది.  రూ.100 స్టాంప్‌ పేపర్‌పై ఒప్పందం చేసుకున్నారు. అందులో తేదీ కూడా వేయలేదని సీఐడీ చెప్పింది.  రూ.3,611.05 కోట్ల విలువ మేరకు కాంట్రాక్టును ఎలా నిర్ధారించారన్నదీ కూడా లేదని సీఐడీ చెబుతోంది. సీమెన్స్, డిజైన్‌ టెక్‌ సంస్థలు సమకూర్చాల్సిన 90 శాతం నిధులను ఏ విధంగా లెక్కించారన్నదీ చెప్పనే లేదు. సంబంధిత మొత్తం వేయాల్సిన చోట ఖాళీగా వదిలేశారని సీఐడీ ఆరోపించింది.   జీవో ప్రకారం 90 శాతం నిధులు వెచ్చించాలన్న విషయాన్ని సీమెన్స్, డిజైన్‌ టెక్‌ కంపెనీలు పట్టించుకోలేదు. అయినా సరే ప్రభుత్వం మాత్రం తన వాటాగా చెల్లించాల్సిన 10 శాతం నిధులను జీఎస్టీతో సహా మొత్తం రూ.371 కోట్లు చెల్లించేసింది. అసలు పనులు చేయకుండానే నిధులు ఎలా చెల్లిస్తారని అప్పటి ఆడిట్‌ అకౌంటెంట్‌ జనరల్‌ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసినా సరే చంద్రబాబు ప్రభుత్వం పట్టించు కోలేదని సీఐడీ ఆరోపించింది. 


షెల్ కంపెనీల ద్వారా చేతులు మారాయన్న సీఐడీ 


ఏపీఎస్‌ఎస్‌డీసీతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత అందుకోసం ఢిల్లీ కేంద్రంగా ‘స్కిల్లర్‌’ అనే షెల్‌ కంపెనీని సృష్టించారని సీఐడీ ఆరోపించింది.  ఆ కంపెనీకి సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ సరఫరా కోసం రూ.241 కోట్లకు సబ్‌ కాంట్రాక్టుకు ఇచ్చినట్టు చూపించారన్నారు.  ఆ ‘స్కిల్లర్‌’ కంపెనీ ముంబయిలోని ‘అలైడ్‌ కంప్యూటర్స్‌ ఇంటర్నేషనల్‌ (ఏఐసీ) అనే మరో షెల్‌ కంపెనీకి వర్క్‌ ఆర్డర్‌ ఇచ్చినట్టుగా  చూపించారని..  ఆ మేరకు ఏపీఎస్‌ఎస్‌డీసీకి సాఫ్ట్‌వేర్, హార్ట్‌వేర్‌ సరఫరా చేసినట్టుగా ఏసీఐ కంపెనీ నకిలీ ఇన్‌వాయిస్‌లు సృష్టించిందని సీఐడీ ఆరోపమ.  ఢిల్లీకి చెందిన పాట్రిక్స్‌ ఇన్ఫో సర్వీసెస్, ఇన్‌వెబ్‌ ఇన్ఫో సర్వీసెస్, అరిహంట్‌ ట్రేడర్స్, జీఏ సేల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే షెల్‌ కంపెనీలు తెరపైకి వచ్చాయని చెప్పారు.   ఆ నకిలీ ఇన్‌వాయిస్‌ల ఆధారంగా రూ.241 కోట్లు ఏసీఐకి చెల్లించారని..   దాన్నుంచి ఏసీఐ కంపెనీ తన 5 శాతం కమిషన్‌ను తగ్గించుకుని మిగిలిన మొత్తాన్ని తిరిగి ఢిల్లీలోని డిజైన్‌ టెక్‌ కంపెనీకి చెల్లించిందని సీఐడీ చెబుతోంది.  


తప్పుడు ఆరోపణలంటున్న టీడీపీ 


 90 శాతం సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలు భరించి పది శాతం ప్రభుత్వం భరించేలా స్కిల్ డెలవప్ మెంట్ ఒప్పందం జరిగింది. అందులో దాదాపుగా మూడు వేల కోట్లు సీమెన్స్ పెట్టాలి. కానీ అవేమీ పెట్టకుండానే ప్రభుత్వం పదిశాతం ఇచ్చింది. అవి దారి మళ్లాయనేది సీఐడీ చేస్తున్న ప్రధాన ఆరోపణ.  కానీ ఒప్పందంలో ప్రాజెక్టు వాల్యూ  రూ. 3700 కోట్లు ఇందులో 90 సీమెన్స్ పెడుతుందంటే దానర్థం. డబ్బులు తెచ్చి పెట్టండ కాదు.. సాఫ్ట్ వేర్..ఇతర స్కిల్ అని ఒప్పందపత్రాల్లోనే ఉందని టీడీపీ విడుదల చేశారు.  ఒప్పందంలో ఉన్నట్లు స్కిల్ డెలవప్ మెంట్ సెంటర్లు అన్ని చోట్లా పెట్టారని గుర్తు చేస్తున్నారు. ఒప్పందంలో ఉన్నట్లుగా పూర్తి స్థాయిలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు పెట్టారని.. ట్రైనింగ్ ఇచ్చారని వైసీపీ ప్రభుత్వం కూడా సర్టిఫై చేసిందని చెబుతున్నారు. ఇప్పటికీ స్కిల్ ట్రైనింగ్ సెంటర్లు నడుస్తున్నాయి. ఇక స్కాం ఎక్కడ ఉందని టీడీపీ ప్రశ్నిస్తోంది. 


అప్పట్లో కీలక నిర్ణయాలు తీసుకున్న అధికారులను కనీసం ప్రశ్నించలేదంటున్న టీడీపీ 


 స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ తరపున టీడీపీ హయాంలో 40కిపైగా నైపుణ్య అభివృద్ది కేంద్రాలు సిమెన్స్ నేతృత్వంలో ఏర్పాటు చేశారు.   దానికి ఎండీగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రేమ్ చంద్రారెడ్డి చెల్లింపులు చేశారు.   అదే సమయలో రెండు కమిటీలు ఈ మొత్తాన్ని పర్యవేక్షించాయని.. ఆ కమిటీలకు ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఐఏఎస్ అధికారులు అజయ్ జైన్,  రావత్‌లు నేతృత్వం వహించారు. వారి సిఫార్సుల మేరకే అన్నీ జరిగాయి.   స్కిల్ డెలవప్‌మెంట్ స్కాం పేరుతో సీఐడీ చెబుతున్న  మొత్తం వ్యవహారంలో కీలకంగా వ్యవహరించి నిధులు విడుదల చేసింది రిటైర్డ్ ఐఏఎస్ ప్రేమచంద్రారెడ్డి కాగా.. కేత్ర స్థాయిలో పర్యటనలు చేసి.. రిపోర్టులు ఇచ్చి.. ఒప్పందం చేసుకోవాలని సూచించింది ప్రస్తుతం సీఎంలో ఉన్న  ఐఏఎస్ అధికారులు అజయ్ జైన్, షంషేర్ సింగ్ రావత్‌లు. సీఐడీ ఎఫ్‌ఐఆర్‌లో నిధులు మంజూరు చేసిన ఎండీ పేరు లేదని టీడీపీ చెబుతోంది.  రెండు కీలక కమిటీల చేతుల మీదుగా ఈవ్యవహారాలు నడిచాయని..  ఆ కమిటీలకు సారధ్యం  వహించిన ఐఏఎస్‌ల పేర్లూ లేవని టీడీపీ చెబుతోంది.     


జీఎస్టీ ఎగ్గొట్టారని డిజైన్ టెక్ ఇతర సంస్థలపై ఈడీ కేసులు  


ఈ కేసులో డిజైన్ టెక్ తో పాటు ఇతర  సంస్థలు... జీఎస్టీ ఎగ్గొట్టాయని  ఈడీ కేసు నమోదు  చేశారు. వాటిపై కేసులు నడుస్తున్నాయి. ఇందులో అవినీతి జరిగిందని ఈడీ చెప్పలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. 


మొత్తంగా స్కిల్ స్కాం కేసులో  సీఐడీ బయటపెట్టబోయే వివరాలు, ఆధారాలే కీలకంగా ఉండనున్నాయి.