‘‘ఈ రోజు షీయర్ జోన్ (ద్రోణి) 21° N అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టంకి 3.1 కిమీ నుండి 7.6 కిమీ మధ్యలో కొనసాగుతూ ఉంది. ఈ రోజు క్రింది స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపునకి వీస్తున్నాయి’’ అని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో  తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.


ఈరోజు రాష్ట్రంలో భారీ వర్షాలు అక్కడక్కడ కొన్ని (ఉత్తర, ఈశాన్య) జిల్లాలలో వచ్చే అవకాశం ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో (గాలి వేగం గంటకు 30 నుండి 40 కిలో మీటర్లతో) కూడిన వర్షాలు అక్కడక్కడ కొన్ని జిల్లాలలో వచ్చే అవకాశం ఉంది. 


హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 29 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 08 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 29.3 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.6 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 81 శాతంగా నమోదైంది.


ఏపీలో ఇలా
వాయువ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ తీరాల వద్ధ గల అల్పపీడన ప్రాంతం ఈరోజు బలహీనపడిందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఏమైనప్పటికి దాని అనుబంధ ఉపరితల అవర్తనం దక్షిణ అంతర్గత ఒడిశా, సరిహద్దు ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఎత్తుతో నైరుతి వైపు వంగి ఉంటుంది. ఋతుపవన ద్రోణి ఈ రోజు, రాయ్‌పూర్, మాణ్డలా, బికనీర్, కళింగపట్నం అక్కడి నుంచి ఆగ్నేయ దిశగా వాయువ్య & పరిసర ప్రాంతాలు అనగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 2 .1 కిలోమీటర్లు ఎత్తులో విస్తరించింది.


ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్  & యానాం
ఈరోజు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాల చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. భారీ  వర్షాలు  ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటరువేగముతో వీయవచ్చు. దక్షిణ కోస్తాలో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుండి 40 కిలో మీటరు వేగముతో వీయవచ్చు. 


‘‘బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడి నేరుగా ఒడిషాలోకి దూసుకెళ్లింది. దీని వలన రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు తగ్గుముఖం పట్టినా, పలు భాగాల్లో వర్షాలు నమోదయ్యే సూచనలను కనిపిస్తోంది. ప్రస్తుతం ఆంధ్రా - తమిళనాడు సరిహద్దు భాగాలైన చిత్తూరు జిల్లాలోని పలు భాగాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. మరో వైపున చిత్తూరు టౌన్ లో కూడ ప్రస్తుతం వర్షాలు ప్రారంభించింది. మరో గంట వరకు ఈ వర్షాలు కొనసాగి తమిళనాడులోనికి ప్రవేశిస్తున్నాయి’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.