Chandrababu On Jangareddigudem Deaths : పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు(Chandrababu) పర్యటించారు. భారీ ర్యాలీతో జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం చేరుకున్న చంద్రబాబు.. టీడీపీ(TDP) శ్రేణులు ఘన స్వాగతం పలికారు. జంగారెడ్డిగూడెంలో మృతుల కుటుంబాలకు చంద్రబాబు పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి లక్ష చొప్పున పార్టీ నుంచి ఆర్థిక సాయం అందించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. బాధిత కుటుంబాలను చంద్రబాబు ఓదార్చారు. చంద్రబాబు వద్ద బాధలు చెప్పుకుని కన్నీరు పెట్టుకున్నారు బాధిత మహిళలు. ఆడబిడ్డల తాళిబొట్లు తెంచేసిన వ్యక్తి సీఎం జగన్(CM Jagan)అని చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వద్దకు వెళ్లవద్దు అని తమను బెదిరించారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబును కలిస్తే పెన్షన్ కూడా ఆపేస్తామని బెదిరించారని వెంకట లక్ష్మి అనే మహిళ వాపోయింది.
26 మంది తాళిబొట్లు తెంచారు
నాడు గొడ్డలి పోటును గుండెపోటు అని చెప్పిన జగన్ ఇవాళ సారా(Illicit Liquor) మరణాలను సహజ మరణాలు అంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. సిగ్గులేకుండా మరణాలను దాచిపెడుతున్నారని విమర్శించారు. 26 మంది చనిపోయారని చంద్రబాబు ఆరోపించారు. "నేను చేసేవి ప్రజా రాజకీయాలు. వివేకా హత్య(Viveka Murder)లో నాపై నిందలు వేశారు. ఎన్నికల ముందు చెప్పిన మద్యపాన నిషేధం ఏమయ్యింది. సొంత బ్రాండ్లు తేవడమే మద్యపాన నిషేధమా?. మద్యం రెట్లు పెంచడం వల్ల తాగేవాళ్లు తగ్గలేదు. చనిపోయే వాళ్ల సంఖ్య పెరిగింది. కమిషన్లు కోసమే వైన్ షాప్స్ లో ఆన్లైన్ చెల్లింపులు పెట్టడం లేదు. వైసీపీ నాయకుల కల్తీ సారా వల్ల 26 మంది తాళిబొట్లు తెగిపోయాయి. టీడీపీ లేకపోతే చనిపోయిన కుటుంబాల వైపు ప్రభుత్వం చూసేది కాదు. వైసీపీ నేతల అవినీతి అనకొండ అంతటి అవినీతి." అని చంద్రబాబు అన్నారు.
నాటు సారా వాళ్లను వదిలేది లేదు!
కల్తీ సారాతో చనిపోయిన 25 కుటుంబాలకు టీడీపీ పార్టీ నుంచి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. LG పాలిమర్స్ తప్పు వల్ల చనిపోతే ప్రభుత్వం పరిహారం ఇచ్చింది. ఇవి ప్రభుత్వం చేసిన హత్యలు పరిహారం ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల సాయం అందిస్తామన్నారు.