Kapu Reservations : ఏపీలో కాపు రిజర్వేషన్ల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కాపులకు రిజర్వేషన్ల కల్పనపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య కీలక డిమాండ్ చేశారు. అగ్రవర్ణాల్లో వీకర్స్ సెక్షన్ కింద కేంద్రం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం రిజర్వేషన్లు కాపులకు అమలు చేయాలని సీఎం జగన్‌ను కోరారు. రాష్ట్ర శాసనసభ చేసిన తీర్మానం మేరకు కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. కాపులకు రిజర్వేషన్ అంశంపై డిసెంబర్ 30వ తేదీలోపు ఉత్తర్వులు జారీ చేయాలని హరిరామ జోగయ్య డెడ్ లైన్ విధించారు. లేకపోతే జనవరి 2  నుంచి నిరహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. ఆ మేరకు మంగళవారం ఆయన ఓ వీడియో విడుదలు చేశారు. కేంద్రం అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించగా, వాటిలో 5 శాతం కాపులకు ఇవ్వడానికి టీడీపీ హయాంలో ప్రయత్నించారన్నారు. బిల్లు గవర్నర్‌ ఆమోదం పొందే సమయానికి వైసీపీ అధికారంలోకి రావడంతో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు పెండింగ్ లో ఉన్నాయన్నారు. మూడేళ్లలో సీఎం జగన్‌ కాపులకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఈనెల 30లోపు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే తాను నిరవధిక నిరాహార దీక్ష చేపడతానని హరిరామ జోగయ్య తెలిపారు.  


రాష్ట్ర జాబితాలో ఉన్న వారికి రిజర్వేషన్లు కల్పించవచ్చు -కేంద్రం 


ఏపీలో కాపు సామాజిక వర్గానికి ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల ప్రవేశాల్లో ఓబీసీ రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్రం నుంచి ఎలాంటి అనుమతి అవసరం లేదని చెప్పారు. కాపులకు రిజర్వేషన్లపై తమ పాత్ర ఏం లేదని చెప్పారు. 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019 ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ఓబీసీ వర్గాలకు గరిష్టంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పించవచ్చని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. 105వ రాజ్యాంగ సవరణ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు సొంత జాబితాను తయారుచేసుకోవచ్చని తెలిపింది. ఓబీసీ రిజర్వేషన్లు కల్పనలో రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందని పేర్కొంది. 


ముద్రగడ లేఖ 


 కాపు రిజర్వేషన్ల అంశంపై కాపు రిజర్వేషన్ల పోరాట సమితి నేత ముద్రగడ పద్మనాభం సీఎం జగన్ కు ఇటీవల లేఖ రాశారు. సుప్రీంకోర్టు ఈ డబ్ల్యూ ఎస్ పై ఇచ్చిన తీర్పు,  రిజర్వేషన్లు రాష్ట్రాలు అమలు చేసుకోవచ్చని కేంద్రమంత్రి  ఇచ్చిన సమాధానం పై దృష్టి పెట్టాలని లేఖలో ముద్రగడ విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్లపై పరిశీలన చేయాలన్నారు. అందరూ అనుభవించగా మిగిలిన దానిలో  తమ రిజర్వేషన్లు ఇప్పించాలని కోరారు. 2019 ఎన్నికల్లో మెజార్టీ నియోజకవర్గాలలో కాపు జాతి మీ గెలుపుకు కృషి చేశారని.. కాపు జాతికి రిజర్వేషన్ కల్పించి మరొకసారి కాపులు మీ విజయానికి ఉపయోగపడేలా చూసుకుంటే బాగుంటుందని సూచించారు. మిగతా కులాలు వారిలాగే కాపు జాతికి వెలుగులు చూపించాలని ముద్రగడ పద్మనాభం జగన్ ను కోరారు.  ఎన్టీఆర్, వైఎస్ఆర్ ల ను ప్రజలు దేవుళ్ళు లా  భావించారు, పేద వర్గాలకు మంచి చేసి మీరు ప్రేమించబడడానికి పునాదులు వేసుకోవాలని సలహా ఇచ్చారు. రిజర్వేషన్లు కల్పించుటకు ఆలోచన చేసి పేద కాపులకు న్యాయం చేయాలన్నారు. తన ఈ లేఖ వల్ల జగన్ ఇబ్బంది పడతారని ముద్రగడ పద్మనాభం అనుకున్నారేమో కానీ చివరిలో వివరణ కూడా ఇచ్చారు. తన  జాతి కోసం తపన తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆలోచన నాకు లేదని లేఖలో వివరణ ఇచ్చారు.