IMD Temperature Alert | అమరావతి: గత కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో ఎండలతో ఉక్కపోత పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. జనవరి చివరి వారం నుంచే మార్చి నెలాఖరులో ఉండే ఎండలను చూసి అప్పుడే వేసవి కాలం వచ్చేసిందా అంటూ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఫిబ్రవరి తొలి వారంలోనూ అధిక ఉష్ణోగ్రతలు చూసి.. ఇప్పుడే ఇలా ఉండే వేసవిలో తమ పరిస్థితి ఏంటని రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మార్చి నెల నుంచి వడగాల్పులు మొదలయ్యే అవకాశం ఉంది.

అటు తెలంగాణలోనూ కొన్ని రోజులుగా ఎండ తీవ్రత అధికంగా ఉంది. హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు అప్పుడే 34 డిగ్రీల మేర నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ లో 37 డిగ్రీలు, భద్రాచలంలో 36.8, ఖమ్మం, మహబూబ్ నగర్ లలో 36.4 డిగ్రీలు, నిజామాబాద్ లో 36 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలికాలంలోనూ ఎండ తీవ్రతకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఉష్ణోగ్రత సగటున ఒక డిగ్రీ మేర పెరిగితే మరణాలు 0.2 శాతం నుంచి 5.5 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.అత్యంత వేడి సంవత్సరంగా 2024భూతాపం కారణంగా గత దశాబ్దం, 15 ఏళ్లలో పలుమార్లు ఎండలు రికార్డు సృష్టించాయి. 2010 నుంచి 2024 మధ్యకాలంలో అత్యంత వేడి సంవత్సరాలుగా పదేళ్లు రికార్డు నెలకొల్పాయంటే ఎండల తీవ్రత ఎలా పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. అత్యంత వేడి దశాబ్దంగా 2015- 2024  నిలిచింది. అత్యంత వేడి సంవత్సరంగా 2024 రికార్డు సృష్టించిందని తెలిసిందే. ఈ ఏడాది సైతం భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ సంస్థ తెలపడంతో ప్రజలు టెన్షన్ పడుతున్నారు. మరోవైపు శీతాకాలంలో చలి తీవ్రత తగ్గిపోయి,  అసాధారణ వేడి ఉంటుందని వాతావరణశాఖ చెబుతోంది. రానున్న రోజుల్లో వేడిని తట్టుకోలేని పరిస్థితి నెలకొంటుందని, కనుక ప్రజలకు చెట్ల పెంపకాన్ని సూచిస్తోంది. ఏపీ సహా పలు రాష్ట్రాల్లో భారీ ఉష్ణోగ్రతలుకేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలలో అసాధారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హెచ్చరించారు. చిరు జల్లులు కురిసే అవకాశం ఉండటంతో ఢిల్లీకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అసలే ఢిల్లీలో నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజలు పెద్ద ఎత్తున ఇళ్ల నుంచి బయటకు రానున్నారు. బాపట్ల, నందిగామ, కావలి, కర్నూలులో మంగళవారం భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వీటితో పాటు కాకినాడ, మచిలీపట్నం, తుని, నరసాపురం తదితర ప్రాంతాల్లో నిన్న ఒకేరోజు ఏకంగా 3 నుంచి 6 డిగ్రీలు మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం కలవరపెడుతోంది. అసలే ఏపీలో పలు జిల్లాలకు తీర ప్రాంతం ఉండటంతో ఎండ వేడి కంటే, హ్యుమిడిటీ సమస్య అధికంగా ఉంటుందని తెలిసిందే. కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలోనూ ఫిబ్రవరి రెండో వారంలో 2 నుంచి 4 డిగ్రీలు మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని ఆ ప్రాంత ప్రజలను ఐఎండీ అలర్ట్ చేసింది.