Viral Video: టీమిండియా సభ్యునికి చేదు అనుభవం.. ఫ్యాన్ అనుకుని హోటల్లోకి అనుమతించని పోలీసులు..
బస్సులో నుంచి బ్యాగ్ తో బయటకు వస్తున్న రఘుని ఒక పోలీసు ఆపాడు. ఫ్యాన్ అనుకుని అతడిని అక్కడి నుంచి పంపించాలని అనుకున్నాడు. తన గురించి రఘు కాసేపు వివరించడంతో ఆ పోలీసు తను చేసిన మిస్టేక్ ను గుర్తించాడు.

Police Denied Entry to Team India Member: ఇంగ్లాండ్ తో తొలి వన్డే ఆడేందుకు నాగపూర్ కి భారత్ చేరుకుంది. అయితే ఆటగాళ్లకు నగరంలోని రాడిసన్ హోటల్లో బస ఏర్పాటు చేశారు. హోటల్ లోనికి వెళ్లే క్రమంలో ఒక టీమిండియా సభ్యునికి చేదు అనుభవం ఎదురైంది. బస్సు దిగి హోటల్లోకి వెళుతుండగా, స్థానిక పోలీసు అడ్డుకున్నాడు. ఆ సభ్యుడు మరెవరో కాదు. భారత జట్టులోని త్రోడౌన్ స్పెషలిస్టు రఘు.
బస్సు నుంచి బ్యాగ్ తో బయటకు వస్తున్న అతడిని ఒక పోలీసు ఆపాడు. ఫ్యాన్ అనుకుని అతడిని ఆపి, అక్కడి నుంచి పంపించాలని అనుకున్నాడు. అయితే రఘు తన గురించి కాసేపు వివరించడంతో ఆ పోలీసు తను చేసిన మిస్టేక్ ను గుర్తించి, హోటల్లోకి పంపించాడు. తాజాగా సోషల్ మీడియాలో ఈ వీడియో వైరలైంది. అభిమానులు దీనిపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తూ, షేర్లు, లైకులు చేస్తున్నారు.
జట్టుతో కలిసిన భారత ఆటగాళ్లు..
టీ20 సిరీస్ లో ఆడని ఆటగాళ్లు తాజాగా భారత జట్టుతో కలిశారు. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభమాన్ గిల్, శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్ తదితర ఆటగాళ్లు వన్డేల కోసం జట్టుతో కలిశారు. ఈనెల 6 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం అవుతుంది. ఈనెల 19 నుంచి ప్రారంభమయ్యే ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా ఈ సిరీస్ ను నిర్వహిస్తున్నారు. ఇక వన్డే సిరీస్ కు భారత్ కొన్ని మార్పులు చేసింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్థానంలో హర్షిత్ రాణా, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిలను జట్టులోకి తీసుకుంది.
అభిషేక్ టెస్టుల్లోనూ ఆడతాడు..
ఇటీవల ముగిసిన టీ20 సిరీస్ లో అద్భుతంగా రాణించిన అభిషేక్ శర్మపై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. అతడు త్వరలోనే టీమిండియా టెస్టులకు ఆడతాడని తెలిపాడు. గతంలో టెస్టులను వీరేంద్ర సెహ్వాగ్, వివియన్ రిచర్డ్స్, ట్రావిస్ హెడ్ దూకుడుగా ఆడుతూ వినోదాన్ని పంచే వారని, అలాంటి కోవలోకే అభిషేక్ కూడా వస్తాడని తెలిపాడు. దేశవాళీల్లో పంజాబ్ కు తను ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ముగిసిన సిరీస్ లో టీమిండియా తరపున టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరుతోపాటు అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్ గా కూడా నిలిచాడు. అలాగే ఇంగ్లాండ్ పై ఒక ద్వైపాక్షిక సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ గా అభిషేక్ రికార్డుల్లోకి ఎక్కాడు. అలాగే తను మంచి లెగ్ స్పిన్నర్ గా కూడా రాణించగలడని భజ్జీ విశ్వాసం వ్యక్తం చేశాడు. తనలో మంచి లెగ్గీ ఉన్నాడని, సానబెడితే మంచి స్పిన్నర్ గా ఎదుగుతాడని పేర్కొన్నాడు. అభిషేక్ ను ఎప్పుడు కలిసినా, తనలోని స్పిన్నర్ గురించే మాట్లాడుతుంటానని, మరింత బాగా ప్రాక్టీస్ చేస్తే తను మంచి స్పిన్నర్ కాగలడని తెలిపాడు.
Also Read: Ind Vs Eng ODI Series Updates: టీమిండియాలోకి మిస్టరీ స్పిన్నర్.. ట్రైనింగ్ సెషన్లో ప్రత్యక్షం..