Southwest Monsoon : నైరుతి రుతుపవనాలు గత ఏడాది కంటే ముందే కేరళను తాకాయి. కానీ ఉపరితల ఆవర్తనం, పశ్చిమ దిశ నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో రుతుపవనాల గమనం మందగించడంతో ఏపీలోకి ఆలస్యంగా ప్రవేశించాయి. నైరుతి రుతుపవనాలు ఏపీలోని రాయలసీమలోకి ప్రవేశించాయని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. మరికొన్ని గంటల్లో ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని వాతావరణ కేంద్రం ప్రకటించనుంది. ప్రస్తుతం మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, గోవా, దక్షిన మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మిగిలిన భాగాలు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ మధ్య మరియు వాయువ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు ముందుకు సాగుతున్నాయి. నైరుతి రుతుపవనాలు తెలంగాణకు రావడానికి మరో మూడు, నాలుగు రోజులు సమయం పట్టనుందని వాతావరణశాఖ అంచనా వేసింది.  



ఏపీలో వాతావరణం ఇలా..
మరో రెండు రోజుల్లో మహారాష్ట్రలోని మరిన్ని ప్రాంతాలు, మొత్తం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లోని మరిన్ని ప్రాంతాలు, పశ్చిమ మధ్య మరియు వాయువ్య బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఉత్తర కోస్తాంధ్రం, దక్షిణ కోస్తాంధ్రతో పాటు యానాంలోనూ గాలులు వీస్తున్నాయి. రుతుపవనాలు అంటే గాలులు మాత్రమే, వర్షాలు ఒక్కోసారి గాలులకంటే ముందుగానే వస్తాయి, ఒక్కోసారి సరైన సమయానికి వస్తాయి, ఒక్కోసారి ఆలస్యమవుతాయని ఏపీ వెదర్ మ్యాన్ పేర్కొన్నారు. విశాఖ నగరంలో ఉక్కపోత విపరీతంగా ఉంటుంది.






ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, యానాంలో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఏపీలో కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనుండగా.. మరికొన్ని చోట్ల వేడి, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడతారు. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ ఏడాది రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో వర్షాలు లేక, ఎండలు, ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల కోసం రైతన్నలు ఎదురుచూపులు మరో మూడు, నాలుగు రోజుల్లో ఫలించనున్నాయి. రాయలసీమలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. మరికొన్ని గంటల్లో పూర్తి స్థాయిలో ఒక్కో జిల్లాలోకి రుతుపవనాలు వ్యాపిస్తాయి. సీమ జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురవనున్నాయి.


తెలంగాణలో వడగాల్పులు
నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది తెలంగాణలో ఆలస్యంగా ప్రవేశించనున్నాయి. ఉపరితల ఆవర్తనం, పశ్చిమ గాలుల ప్రభావంతో మందగించిన రుతుపవనాల గమనం మళ్లీ బలం పుంజుకుని జూన్ 14 తరువాత తెలంగాణలోకి రానున్నాయి. హైదరాబాద్ లో రోజంతా ఆకాశం మేఘావృతమై ఉండనుంది. మండు వేసవి ఎండల నుంచి ఉపశమనం కలగనుంది. కానీ మధ్యాహ్నానికి హైదరాబాద్‌లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో వడగాల్పులు వీచనున్నాయి. కొన్ని జిల్లాల్లో మాత్రం తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేశారు.