Nayanthara Vignesh Wedding : పెళ్లితో నూతన దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టిన కొన్ని గంటల్లోనే నటి‌ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ దంపతులకు భారీ షాక్ తగిలింది. గురువారం మహాబలిపురంలో పెరటాన్ గ్రాండ్ రిసార్ట్ కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా నయన్ విఘ్నేష్ వివాహ వేడుకలు జరిగాయి.  దీంతో ఎన్నో రోజులుగా నయనతార అభిమానుల కళ నెల వేరింది అనే చెప్పుకోవాలి. వివాహ బంధంలో ఒక్కటైన నయనతార విఘ్నేష్ లు నేరుగా తిరుమల స్వామి వారి ఆశీస్సుల కోసం కొందరు బంధు మిత్రులతో కలిసి తిరుమలకు చేరుకున్నారు. అయితే కొండపై ఫొటో షూట్ కోసం నయనతార దంపతులు టీటీడీ విజిలెన్స్ అధికారిని అనుమతి‌ కోరారు. అందుకు టీటీడీ విజిలెన్స్ అధికారులు అనుమతి నిరాకరించారు. ఈ క్రమంలో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద సినీ నటి కావడంతో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఎటువంటి వాహన తనిఖీ చేయకుండా కొండపైకి అనుమతించడంతో ఫొటో షూట్ కి సంబంధించిన పరికరాలతో నయనతార కొండకు చేరుకున్నారు. కొండకు చేరుకోగానే ఎస్ఎంసీ కాటేజ్ ప్రాంతం నుంచి సుపధం మార్గం వద్దకు చేరుకున్న నయనతార దంపతులు దాదాపు 26 మంది బంధు, మిత్రులతో కలిసి స్వామి వారి దర్శనం కోసం ఆలయ ప్రవేశం చేశారు. 



నయనతారకు నోటీసులు 


కల్యాణోత్సవ సేవలో పాల్గొన్న నయనతార విఘ్నేష్ లు స్వామి వారి దర్శనంతరం ఆలయ మహా ద్వారం నుంచి బయటకు వచ్చారు.‌ ఈ క్రమంలోనే ఆలయ మహా ద్వారం వద్దనే నయనతార పాదరక్షలు దరించి నడవడం, ఆలయ ముందే ఫొటో షూట్ చేయడం భక్తుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉండడంపై టీటీడీ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. దాదాపు మూడు నిమిషాల పాటు ఆలయం ముందు ఫొటో సూట్ చేయడమే కాకుండా పవిత్రంగా భావించే తిరుమాఢ వీధుల్లో నయనతార పాదరక్షలు ధరించి వెళ్లడంపై టీటీడీ అధికారులు సీసీ కెమెరాల ద్వారా గుర్తించి నయనతారకు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమయ్యారు. నేరుగా నయనతారతో మాట్లాడిన టీటీడీ విజిలెన్స్ అధికారులు వివరణ కోరారు. తెలిసి తెలియకుండా తాను పాదరక్షలు ధరించడం జరిగిందని, తిరుమల పవిత్రత దెబ్బ తీసే ఉంటే స్వామి వారి భక్తులకు క్షమాపణ కోరుతామని చెప్పినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రెస్ కు ఓ వీడియో కూడా విడుదల చేస్తామన్నారని అధికారులు చెబుతున్నారు. 


తెలిసి తెలియక తప్పు


సినీ నటి నయనతార శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో చెప్పులతో తిరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీటీడీ అధికారులు సీరియస్ అయ్యారు. కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉండటంతో నయనతారకు నోటీసులు జారీ చేయనున్నట్లు అంతకు ముందు టీటీడీ సీవీఎస్వో నరసింహ కిషోర్ వెల్లడించారు. మీడియా సమావేశంలో సీవీఎస్వో కిషోర్ మాట్లాడుతూ ఆలయ మాడ వీధుల్లో చెప్పులతో నయనతార నడిచినట్లు గుర్తించామన్నారు. ఫొటో సూట్ నిర్వహించినట్లు విజువల్స్ ద్వారా స్పష్టంగా అర్థం అవుతోందని, టీటీడీ రూల్స్ కు వ్యతిరేకంగా నయనతార వ్యవహరించారని తెలిపారు. టీటీడీ రూల్స్ ప్రకారం ఆలయ మాడ వీధుల్లో చెప్పులు వేసుకొని నడవరాదనే నిబంధనలు ఉన్నాయని గుర్తు చేశారు. టీటీడీ విజిలెన్స్ తరపున నయనతారకు నోటీసు జారీ చేయనున్నామని స్పష్టం చేశారు.  చెప్పులు, ఫొటో షూట్ వ్యవహారంపై ఆమెను ప్రశ్నించడం జరిగిందన్న ఆయన....భక్తుల మనోభావాలు దెబ్బ తిని ఉంటే స్వామి వారికి, టీటీడీకి, భక్తులకు క్షమాపణ చెప్తానని నయనతార వెల్లడించారని చెప్పారు. నోటీసులు జారీ చేసిన అనంతరం ఆమె వద్ద నుంచి వచ్చే సమాధానం ఆధారంగా చర్యలు చేపడుతామన్నారు. తప్పు జరిగిందని మాతో నయనతార ఒప్పుకున్నారు. కావాలని చేసింది కాదు తెలియక చేశామని పేర్కొన్నారు. దీనిపై వీడియో రిలీజ్ చేస్తామని విగ్నేష్, నయనతార చెప్పారని వెల్లడించారు. 


తిరుమలలో నయనతార దంపతుల వివాహం ఎందుకు జరగలేదు? 


మొదటగా నయనతార విఘ్నేష్ లు వివాహం తిరుమలలోనే‌ నిర్వహించాలని భావించిన కొన్ని అనివార్య కారణాలతో అనుకున్నది జరుగలేదు. గత నెలలో రెండు మార్లు శ్రీవారి దర్శనానికి విచ్చేసిన నయనతార విఘ్నేష్ లు తిరుమలలో వివాహం చేసుకునేందుకు కొన్ని మఠాల్లో ఉన్న పెళ్లి మండపాలను పరిశీలించారు. ముందే అనుకున్న విధంగానే శ్రీనివాసుడు సన్నిధిలో తమ వివాహం చేసుకోవాలని అందుకు కావాల్సిన అనుమతుల కోసం  టీటీడీ ఉన్నతాధికారిని సంప్రదించారు. అయితే సినీ నటులు కావడంతో సినీ నటులు, రాజకీయ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు అధికంగా విచ్చేసే అవకాశం ఉండడంతో కొంత ఇబ్బందులు తలెత్తుతాయని ముందే గ్రహించిన ఆ ఉన్నతాధికారి వీరి వివాహ వేడుకలు అనుమతిని నిరాకరించారు. అధిక సంఖ్యలో భక్తుల రద్దీ నేపధ్యంలో భక్తుల ఇబ్బందులకు దృష్టిలో తీసుకుని వివాహం బయట ప్రాంతంలో చేసుకునే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని నయనతార విఘ్నేష్ లు సూచించినట్లు సమాచారం. ఇందు కారణంగానే మహాబలిపురంలో ఓ రిసార్ట్ లో వివాహ వేడుకలను జరుపుకున్నారు.‌ పెళ్ళై నూతన జీవితంలోకి అడుగు పెట్టిన కొన్ని గంటల్లోనే నయనతార విఘ్నేష్ లు వివాదంలో చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది.