ఏపీలో సాధారణంగా నమోదవ్వాల్సిన వర్షపాతం కంటే ఈ ఏడాది తక్కువగా నమోదైంది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వర్షపాతం లోటు తగ్గింది. అయినా వర్షపాత లోటు ఎక్కువగానే ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో రెండు జిల్లాలో మాత్రమే అత్యధిక వర్షపాతం నమోదైంది. పది జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. గత రెండు వారాల్లో రాష్ట్రంలో వర్షపాతం లోటు 22 శాతానికి తగ్గింది. రానున్న మూడు నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో వర్షాపాతం లోటు తగ్గే అవకాశం ఉంది.
భారత వాతావరణ శాఖ (IMD) డేటా ప్రకారం, జూన్ 1- జూలై 24 మధ్య ఆంధ్రప్రదేశ్‌లో 151.6 మిమీ వర్షపాతం నమోదైంది. సాధారణ 194.6 మిమీ వర్షపాతం నమోదవ్వాల్సి ఉంది. దీనితో పోలిస్తే 22 శాతం తక్కువగా నమోదైంది. జులై 24 (సోమవారం) వరకు, రాష్ట్రంలోని మొత్తం 26 జిల్లాల్లో ఏడు కోస్తా, ఆరు రాయలసీమ జిల్లాలతో సహా 13 జిల్లాల్లో భారీ లోటు (8 శాతం నుంచి 50 శాతం లోటు) వర్షపాతం నమోదైంది. 11 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా, రెండు జిల్లాలు (ఏఎస్‌ఆర్, కృష్ణా) అధిక వర్షపాతం నమోదైంది.
ఇటీవల కురిసిన వర్షాలతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షపాతం పరిస్థితి మెరుగుపడిందని ఐఎండీ-అమరావతి డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. జూన్ 30 నాటికి 37 శాతం వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో సాధారణం 94.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా కేవలం 59.2 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. జూలై 24 నాటికి 22 శాతానికి తగ్గింది. కృష్ణా జిల్లాలో సాధారణ వర్షపాతం 270.4 మిల్లీమీటర్లకు గాను 381.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ మేరకు జిల్లాలో 41 శాతం అధికంగా వర్షం నమోదైంది. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలో 368.8 మిల్లీమీటర్లకు గాను 450.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇది సాధారణ వర్షపాతం కంటే 22 శాతం అదనం. జులై 25 నుంచి 27 వరకు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని, వర్షపాత లోటును ఈ వర్షాలు భర్తీ చేసే అవకాశం ఉందని ఆమె వివరించారు.
జూన్ 1 నుంచి జులై 24 మధ్య తిరుపతి జిల్లాలో 77.7 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ కాలంలో ఇక్కడ సాధారణ వర్షపాతం 160.7 మి.మీ నమోదవ్వాల్సి ఉండగా 52 శాతం లోటుతో కేవలం 77.7 మిల్లీమీటర్లు మాత్రమే రికార్డు అయ్యింది. నెల్లూరు జిల్లాలో 39 శాతం, వైఎస్ఆర్ కడప జిల్లాలో 38 శాతం, అన్నమయ్య జిల్లాలో 35 శాతం, తూర్పుగోదావరిలో 34 శాతం, పశ్చిమగోదావరి, పల్నాడు జిల్లాల్లో 30 శాతం చొప్పున లోటు వర్షపాతం నమోదైంది.
నైరుతి రుతుపవనాల ఆలస్యం కారణంగా రాష్ట్రంలో మొదటి రెండు నెలల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. చాలా జిల్లాల్లో కీలకమైన ఖరీఫ్ పంటలైన వరి, పప్పుధాన్యాల విత్తనాల సాగును ఆలస్యం చేసింది. దీంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రైతుల్లో ఆందోళన నెలకొంది. విత్తనాలు విత్తేందుకు పొలాలను సిద్ధం చేసుకున్న రైతుల్లో భయం నెలకొంది.
బుధవారం (జూలై 26) నుంచి మూడు రోజులపాటు కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అమరావతిలోని వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు. రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి తర్వాత అల్ప పీడనంగా మారే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణ జిల్లాలో కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.