తెలుగు రాష్ట్రాల్లో రాగల రెండు రోజులు వర్షాల ప్రభావం అధికంగా ఉంది. ముఖ్యంగా ఏపీలో ఈ రెండు రోజులు భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
అమరావతి వాతావరణ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పశ్చిమ మధ్య, దానిని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఒక అల్ప పీడనం సెప్టెంబరు 8 ఉదయం ఏర్పడింది. ఇది పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో రాగల 48 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉంటుంది.
ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్ర, దక్షిణ కోస్తాం ఆంధ్ర, రాయలసీమల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గుంటూరు, క్రిష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షం ఒక చోట అత్యంత భారీ వర్షం కురిసే అవకాశ ఉంది. ప్రకాశం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది.
రాయలసీమ ప్రాంతాల్లోని ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్ష సూచన ఉంది. నేడు ఉత్తర కోస్తా ఆంధ్ర, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. కోస్తా తీరం వెంబడి ఈదురు గాలులు గంటకు 45 నుంచి 55 కిలో మీటర్ల వేగంతో, అత్యధికంగా 65 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు వచ్చే 5 రోజులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని వాతావరణ అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే సముద్రంలోనికి వెళ్లిన వారు వెంటనే తిరిగిరావాలని సూచించారు.
తెలంగాణలో వర్షాలు.. (Telangana Weather)
మరోవైపు, సముద్ర మట్టం వద్ద రుతుపవన ద్రోణి జైసల్మేర్, భోపాల్, గోండియా, జగదల్‌పూర్, కళింగపట్నం మీదుగా తూర్పు మధ్య బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రాంతానికి వెళుతుందని అధికారులు తెలిపారు. ఒక ద్రోణి దక్షిణ కొంకణ్ నుంచి ఉత్తర కర్ణాటక, దక్షిణ తెలంగాణ, ఉత్తర కోస్తాంధ్ర మీదుగా బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రాంతంలోని సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని అధికారులు వివరించారు. వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో శనివారం వరకు హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ మేరకు మొదటి రెండు ప్రమాద హెచ్చరికలు (పసుపు, నారింజ రంగుల హెచ్చరికలు) జారీచేశారు.
జిల్లాల వారీగా వర్షాలు పడే ఛాన్స్ ఇలా..
నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు హెచ్చరించారు. ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సూర్యాపేట, మేడ్చల్-మల్కాజిగిరి, హైదరాబాద్, మహబూబ్‌నగర్, వికారాబాద్, నాగర్‌కర్నూల్, సంగారెడ్డి, జోగులాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పసుపు రంగు హెచ్చరిక జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని చెప్పారు.