నిన్నటి మధ్యప్రదేశ్ లోని మధ్య ప్రాంతం నుండి దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టంకి 0.9 కిలో మీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతున్న ద్రోణి /గాలివిచ్చిన్నతి ఈ రోజు బలహీనపడిందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలో తూర్పు, ఆగ్నేయం నుండి కింద స్థాయిలో గాలులు వీస్తున్నట్లు చెప్పారు. 


తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ, వాతావరణ హెచ్చరికలు: 
ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.  ఎల్లుండి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.


Weather Warnings: వాతావరణ హెచ్చరికలు
ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు , మెరుపులతో  పాటు ఈదురు గాలులు ( గాలి  గంటకు 30 నుండి 40 కిలో మీటర్ల వేగం) తో కూడిన వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.


హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఉరుములతో కూడిన మేఘాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 35 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. దక్షిణ, ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 33.7 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.3 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 68 శాతం నమోదైంది.


ఏపీలో వర్షాలు ఇలా
‘‘నేడు రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం నమోదవనుంది. ప్రస్తుత పరిస్ధితులను గమనించినట్లు అయితే అధిక పీడన ప్రాంతం తెలంగాణ మీదుగా కొనసాగుతోంది. దీని వలన రాయలసీమ జిల్లాల్లో వేడి గాలులు విస్తారంగా మధ్యాహ్నం, సాయంకాలం కొనసాగుతుంది కాబట్టి, నంధ్యాల​, కర్నూలు, కడప​, అనంతపురం, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో వేడి గాలులు కొనసాగనుంది. కానీ కోస్తాంధ్రలో కాస్త భిన్నంగా ఉండనుంది. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, ఉభయ గోదావరి, కాకినాడ​, ఏలూరు, ఎన్.టీ.ఆర్., కొనసీమ​, కృష్ణ​, ప్రకాశం జిల్లాలోని తూర్పు భాగాలు, నెల్లూరు జిల్లాలోని తూర్పు భాగాలు, తిరుపతి జిల్లాలోని పలు భాగాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు నేడు నమోదుకానున్నాయి.


రాయలసీమలో ఎండలు విపరీతంగా
రాయలసీమ వ్యాప్తంగా వేడి విపరీతం అయింది. నేడు అత్యధికంగా కర్నూలు నగరంలో 41.5 డిగ్రీలు నమోదయ్యింది. నేడు కూడా భారత దేశంలో ఎండలలో మొదటి స్ధానంలో కర్నూలు నిలుస్తోంది. మరోవైపున అధికపీడన ప్రాంతం కొనసాగుతోంది కాబట్టి రాయలసీమ జిల్లాల్లో వేడి రానున్న రోజుల్లో పెరగనుంది. జాగ్రత్తలు తీసుకోగలరు’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.


తెలుగు రాష్ట్రాలపై ప్రభావం తక్కువే - ఐఎండీ
రానున్న ఐదు రోజుల్లో దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. రానున్న రెండు రోజుల్లో మధ్యప్రదేశ్‌, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ మీదుగా వేడిగాలులు వీచే అవకాశమున్నట్లు తెలిపింది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకపోవడమే మంచిదని పేర్కొంది. ఏప్రిల్‌- జూన్‌ మధ్య కాలంలో దేశంలోని ఆగ్నేయ ప్రాంతంతో పాటు, దక్షిణ భారత దేశంలో ఎండలు లేదా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా నమోదవుతాయని వాతావరణశాఖ కొద్ది రోజుల క్రితమే తెలిపింది.


వాతావరణ విభాగం వివరాల మేరకు.. పశ్చిమ్‌ బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌, బిహార్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, ఝార్ఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఒడిశా, పంజాబ్‌, హరియాణా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు బాగా పెరిగే అవకాశం ఉంది. ఈ ఉష్ణోగ్రతల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై అంతగా ఉండకపోవచ్చని చెప్పారు.