ఎండ వేడితో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఆంధ్రప్రదేశ్‌లో కాస్త చల్లని వాతావరణం కలిగే అవకాశం ఉంది. మరో 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. కానీ, నేడు మాత్రం వాతావరణం పొడిగానే ఉండనున్నట్లు అంచనా వేసింది. నేడు ఉత్తర కోస్తాంధ్ర సహా, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. మరోవైపు ఎండల తీవ్రత నేపథ్యంలో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్, మరికొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. మత్స్యకారులకు కూడా ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.






ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో.. (Temperature in Andhra Pradesh)
ఏపీలోని ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. భానుడి ప్రతాపంతో రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 40 డిగ్రీలను తాకింది. విశాఖలో 36 డిగ్రీలు, తిరుపతిలో 38.4, కర్నూలులో 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నందిగామలో 36.8 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదు కాగా, కావలిలో 36 డిగ్రీలు, నెల్లూరులోనూ 35.5 డిగ్రీలు, విశాఖలో 35.2 డిగ్రీలు, జంగమేశ్వరపురంలో 36.2 డిగ్రీల మేర ఉష్ణోగ్రలు ఉన్నాయి.






‘‘బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే పరిస్ధితులు కనిపిస్తున్నాయి. మరో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది మెల్లగా అభివృద్ధి చెంది వాయుగుండంగా మారనుంది. దీని గమ్యం శ్రీలంకకు చాలా దగ్గరగా వెళ్లటం. దీని వల్ల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఎటువంటి ప్రభావం ఉండదు. గుజరాత్ పై ఉండే ఒక అధికపీడన ప్రాంతం ఈ అల్పపీడనాన్ని కిందకు నెట్టనుంది. దీని వల్ల మనకు వర్షాలు తక్కువగా ఉంటాయి. కానీ ఎక్కడా పంట నష్టం ఉండదు, అలాగే నగరాల్లో వరదలు వచ్చే విధంగా వర్షాలుండవు. ఈ వాయుగుండం శ్రీలంకను తాకిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రం కోస్తా భాగాల్లో, విశాఖ ఏజెన్సీ, మారేడుమిల్లి ప్రాంతంలో అక్కడక్కడ కొన్ని వర్షాలుంటాయి. మిగిలిన ఎక్కడ అంత వర్షాలుండవు.’’ అని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ తెలిపారు.



తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather)
తెలంగాణలో చాలా వరకూ పొడి వాతావరణమే నెలకొంటుందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. గడిచిన 24 గంటల్లో అత్యధిక ఉష్ణోగ్రత ఆదిలాబాద్ జిల్లాలో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వెల్లడించింది. తర్వాత నిజామాబాద్‌లో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత మెదక్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో అధిక ఉఖష్ణోగ్రత నమోదైంది.