తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. సోమవారం పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. మంగళవారం కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్, పరిగి, అరకు, విజయవాడలో వర్షాలు కురవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. ఏపీలోనూ అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
సోమవారం హైదరాబాద్, పరిగి, అరకు, విజయవాడలో కురిసిన వర్షానికి జనాలు ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్‌లో పలుచోట్ల భారీవర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండకాసినా.. మధ్యాహ్నం వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. మబ్బులు పట్టి జోరుగా వాన పడింది. ఏపీలోనూ పలు ప్రాంతాల్లో వర్షం పడింది. విశాఖ జిల్లాలో ఎక్కువ వర్షం నమోదైంది.
పశ్చిమ బెంగాల్ కోల్‌కతాలో ఉరుములతో కూడిన వర్షం పడుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది. ఢిల్లీ, చెన్నైలో అక్కడక్కడా ఉరుములు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.