తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో చలి తీవ్రత కాస్త తగ్గింది. కొన్ని రోజులుగా ప్రజలను అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు వణికించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో గురువారం (జనవరి 6) వాతావరణం పొడిగా ఉంటుందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. అయితే, వర్షాలకు సంబంధించి హెచ్చరికలు ఏమీ లేవని స్పష్టం చేశారు. వచ్చే 10వ తేదీ వరకూ వాతావరణ అంచనాలను హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం ప్రకటించింది. 8వ తేదీ వరకూ రాష్ట్రంలో వాతావరణం పొడిగానే ఉండనుండగా.. జనవరి 10వ తేదీన మాత్రం తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఆ రోజు మాత్రం వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచిస్తూ.. ఎల్లో అలర్ట్ సైతం జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ ఇలా..
ఆంధ్రప్రదేశ్‌లో తక్కువ ఎత్తులో ఈశాన్య, తూర్పు గాలులు రాష్ట్రమంతా విస్తరిస్తున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజులు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ, ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వాతావరణం నేడు పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకుడు ఓ ప్రకటన విడుదల చేశారు.
మత్స్యకారులు వేటకు వెళ్లవచ్చునని, వాతావరణం అనుకూలిస్తుందని తెలిపారు. దక్షిణ కోస్తాంధ్రలో నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో వాతావరణం కాస్త ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. వాతావరణంలో ఎలాంటి మార్పులు ఉండవు.
ఉత్తర భారతదేశంలో నేడు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, నార్త్ రాజస్థాన్, పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ మద్యప్రదేశ్‌లలో నేడు ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. దక్షిణ భారతదేశంలో పలు రాష్ట్రాల్లో చలి తీవ్రత క్రమంగా తగ్గుతోంది.
Also Read: AP Omicron Cases: ఏపీలో కొత్తగా 7 ఒమిక్రాన్ కేసులు... 24కు చేరిన మొత్తం కేసులు