ఏపీలో నేడు, రేపు వర్ష సూచన ఉన్నట్లుగా అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. నిన్న దక్షిణ తమిళనాడు నుంచి రాయలసీ వరకూ సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకూ వ్యాపించి ఉన్న ఉపరితల ద్రోణి ఈ రోజు దక్షిణ తమిళనాడు నుంచి దక్షిణ మధ్య కర్ణాటక వరకూ సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకూ విస్తరించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రాగల మూడు రోజులు వాతావరణం ఇలా ఉండే అవకాశం ఉంది. 


ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో ఈరోజు రేపు తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఈ రోజు నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమ ప్రాంతంలో ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. అయితే, తీవ్ర వర్షాలకు సంబంధించి ఎలాంటి వర్ష హెచ్చరికలు జారీ చేయలేదు.






తెలంగాణలో ఇలా..
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. రాష్ట్రమంతా ఎలాంటి వర్ష సూచన లేదు. వాతావరణం పొడిగా ఉంటుంది. ఆకాశం నిర్మలంగా ఉండడంతో పాటు ఉదయం సమయంలో పొగ మంచు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా.. 29 డిగ్రీల సెల్సియస్‌గా.. 17 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంటుంది. నైరుతి దిశ ఉపరితల గాలులు ఉండనున్నాయి. వీటి వేగం గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వరకూ వీచే అవకాశం ఉంది. 


హైదరాబాద్ సహా పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఉదయం సమయంలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంటుంది. నిన్న అత్యల్ప ఉష్ణోగ్రత ఆదిలాబాద్ జిల్లాలో 10.7 డిగ్రీలుగా నమోదైంది. ఆ తర్వాత హకీంపేట, నిజామాబాద్, మెదక్, రామగుండం ప్రాంతాల్లో కనిష్ణ ఉష్ణోగ్రత 14.5 డిగ్రీలుగా గుర్తించారు. నల్గొండలో చలి తక్కువగా ఉందని అక్కడ 18.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లుగా వాతావరణ అధికారులు గుర్తించారు.