Weather Latest News: నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. నిర్ణీత గడువు కంటే ముందే అరేబియా మహా సముద్రం పరిసర ప్రాంతాలు, మాల్దీవులు, దక్షిణ బంగాళాఖాతంలో విస్తరించి ఉన్నాయి. రాగల 48 గంటల్లో ఈ నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, లక్షద్వీప్ దానిని ఆనుకొని ఉన్న పరిసర ప్రాంతాల్లో మరింతగా విస్తరించనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రుతుపవనాల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. గత ఏడాదితో పోల్చితే వారం నుంచి పది రోజుల ముందే ఏపీ, తెలంగాణలోకి ప్రవేశిస్తున్నాయని అన్నారు.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో..
నేడు ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో మరో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. దక్షిణ కోస్తాలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. అయితే, ఈ ప్రాంతాల్లో నేడు వేడి గాలులకు సంబంధించి ఎలాంటి హెచ్చరిక లేదు. నేడు ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదయ్యే అవకాశం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
తెలంగాణలో పొడి వాతావరణం..
తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ విభాగం వెల్లడించింది. వచ్చే 4 రోజులు ఇలాంటి పరిస్థితే ఉంటుందని వాతావరణ అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు పసుపు రంగు అలర్ట్ జారీ చేశారు.
తెలంగాణలో హైదరాబాద్, జోగులాంబ గద్వాల, మహబూబ్ నగర్, మేడ్చల్ మల్కాజ్ గిరి, నాగర్ కర్నూల్, నారాయణ పేట్, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి తదితర జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
‘‘ఆకాశం సాధారణంగా మేఘాలు పట్టి ఉంటుంది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 39 డిగ్రీలు, 27 డిగ్రీల వరకూ ఉండే అవకాశం ఉంది. వాయువ్య దిశ ఉపరితల గాలులు గంటకు 8 నుంచి 12 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.’’ అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.