తెలంగాణలో మార్చి 24, 25 తేదీల్లో రెండ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. సోమవారం తమిళనాడు నుంచి ఉన్న ద్రోణి మంగళవారం నాటికి దక్షిణ శ్రీలంక నుంచి తమిళనాడు, రాయలసీమ, తెలంగాణ మీదుగా మధ్యప్రదేశ్‌ వరకు విస్తరించింది. దీని ఫలితంగానే రాష్ట్రంలోని పలుచోట్ల అక్కడక్కడా ఓ మోస్తరు జల్లులు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది.పగటి, రాత్రి ఉష్టోగ్రతలు సాధారణం కంటే మూడు డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని వాతావరణశాఖ పేర్కొంది.


తెలంగాణలో వాతావరణ స్థితి
తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు పడుతాయని చెప్పారు. అలాగే, ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ఇక చలి విషయంలో రాష్ట్రం మొత్తం సాధారణ ఉష్ణోగ్రతలే ఉండనున్నాయని తెలిపారు.


ఏపీలో వర్షాలు ఇలా
ఏపీలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై జల్లులు పడుతున్నాయి. నేడు కూడా ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులకు అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. కొన్ని చోట్ల వర్షం సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ కోస్తాలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపారు.


‘‘గాలుల కేంద్రం ప్రస్తుతం బంగ్లాదేశ్ మీదుగా కొనసాగుతోంది. గాలుల కేంద్రం ఒక పక్కన ఉండగా మన ఆంధ్రాలో మాత్రం కొంచం తేమ అలాగే ఉండిపోయింది. దీని వలన నేడు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నగరంలోని పలు భాగాలు, అనకాపల్లి, కాకినాడ​, ఉభయ గోదావరి, ఏలూరు, ఎన్.టీ.ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే మనం వర్షాలను చూడగలము. మిగిలిన భాగాల్లో తక్కువగా లేదా వర్షాలు ఉండవు. 


ఎందుకు ఉత్తరాంధ్రలో ఇంకా వర్షాలు కొనసాగుతున్నాయి ??
కొండ ప్రాంతాల్లో తేమను ఆపడం సహజం. కానీ అరకు లోయలు, ఉత్తరాంధ్రలో ఉన్న కొండలు చాలా ఎత్తైనవి. కాబట్టి వచ్చిన తేమను ఆపుకొని మరి కొన్ని రోజుల పాటు అలాగే ఉంటుంది. అందువలనే అన్ని ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినా ఉత్తరాంధ్రలో మాత్రం వర్షాలు కొనసాగనుంది. మధ్యాహ్నం సాయంకాం కొండల్లో దాగి ఉన్న తేమ సూర్యుని వేడి వలన బయటకు వస్తుంది. అందుకే సాయంకాలం, రాత్రి సమయంలోనే ఉత్తరాంధ్రలో వర్షాలు ఎక్కువగా ఉండనున్నాయి.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.


ఢిల్లీలో వాతావరణం ఇలా..
గత మూడు రోజులుగా దేశ రాజధానిలో నిన్న రాత్రి కురిసిన వర్షం, మేఘాలు, భూకంపం కారణంగా అక్కడి వాతావరణం, ప్రజల మూడ్ పూర్తిగా మారిపోయింది. వర్షం కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో, మేఘాలు, తేమతో కూడిన గాలి కారణంగా వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, బుధవారం నుండి, ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో వర్షంతో బలమైన గాలులు వీస్తాయని, వాతావరణ పరిస్థితులు మరోసారి దిగజారవచ్చు.


IMD అంచనా ప్రకారం, మార్చి 22 నుండి మార్చి 25 వరకు ఢిల్లీ వాతావరణంలో మార్పులు ఉండవచ్చు. భారత వాతావరణ శాఖ ప్రకారం బుధవారం గరిష్ట ఉష్ణోగ్రత 28, కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది. గాలి వేగం నాలుగు నుంచి 16 కిలో మీటర్ల వరకు ఉంటుంది. రోజంతా వివిధ ప్రాంతాల్లో మేఘావృతమై ఉంటుంది.