Weather Updates In AP: అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం శనివారం తుపానుగా మారింది. డిసెంబరు 2న బలపడి వాయుగుండంగా మారి మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. జవాద్ తుపాను దిశను మార్చుకోవడంతో ఉత్తరాంధ్రకు ముప్పు తప్పింది. విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 210 కిలోమీటర్ల దూరంలో.. గోపాల్‌పూర్‌కు 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. పూరికి దక్షిణ నైరుతిగా 390 కిలోమీటర్ల దూరంలో నేటి మధ్యాహ్నానికి వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి.
జవాద్ తుపాను దిశను మార్చుకోవడంతో దక్షిణ కోస్తాంధ్రంలో నేడు వాతావరణం పొడిగా ఉండనుంది. రాయలసీమ ప్రాంతంలోనూ వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వాయుగుండం మరింత బలహీనపడుతూ ఉత్తర ఈశాన్యదిశగా పశ్చిమ బెంగాల్ వైపు పయనిస్తోంది. జవాద్ ముప్పు తప్పినా తీరంలో గంటకు దాదాపు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు తీస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలకు సైతం వర్ష సూచన ఉంది. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. మత్స్యకారులు డిసెంబర్ 6 వరకు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఇదివరకే వేటకు వెళ్లిన వారు సాధ్యమైనంత త్వరగా తీరానికి వచ్చేయాలని అధికారులు సూచించారు.
Also Read: Cyclone Jawad: దిశను మార్చుకున్న జవాద్ తుపాన్.. బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం
ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాల దిశగా కదులుతూ ఆదివారం పెను తుపానుగా మారి ఒడిశాలోని పూరీ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. తీరం వెంబడి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలపింది. ఒక ట్రెండు చోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తుపాను నేపథ్యంలో ముందస్తుగా ఏపీలో సహాయక చర్యల కోసం నాలుగు ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్, 11 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ రంగంలోకి దిగాయి. జవాద్ ముప్పు తప్పడంతో అదనపు బలగాలను సన్నద్ధం చేయలేదని ఏపీ విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పునరావాస కేంద్రాలు ఇదివరకే ఏర్పాటు చేశారు. తీవ్ర వాయుగుండం, జవాద్ తుపాను నేపథ్యంలో మరో మూడు రోజులపాటు ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రమాద హెచ్చరికలేమీ జారీ చేయలేదు. దక్షిణ కోస్తాంధ్రలోనూ మరో మూడు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో వాతావరణం పొడిగా ఉండనుంది. డిసెంబర్ 7,8 తేదీల్లో కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు లేదా ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు.
తెలంగాణలో పొడిగా వాతావరణం..
జవాద్ తుపాను ఒడిశా తీరం వైపు కదలడంతో తెలంగాణపై అంతగా ప్రభావం లేదు. తెలంగాణలో మరికొన్ని రోజులు వాతావరణం పొడిగా ఉండనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కొన్ని జిల్లాల్లో గత ఏడాది కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయిని తెలిపారు. డిసెంబర్ 8 వరకు తెలంగాణకు ఎలాంటి వర్ష సూచన లేదని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Also Read: Zawad Update: బలహీన పడుతున్న జవాద్... ముందస్తు జాగ్రత్తగా రెస్క్యూ టీంలు మోహరింపు