Weather Updates: తాజాగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఏపీలో మరో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు దిశ నుంచి వీస్తున్న గాలులతో ఏర్పడిన అల్పపీడన ద్రోణి, నైరుతి బంగాళాఖాతం సమీపంలోని ఉత్తర శ్రీలంక తీరం నుంచి మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది. నేడు శ్రీలంక నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి వ్యాపించి ఉంది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాం
యానాం, ఉత్తర కోస్తాంధ్రలలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. రేపు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. రేపు ఉరుములు, మెరుపులతో ఒకట్రెండు చోట్ల జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
గత నెలలో కురిసిన భారీ వర్షాలకు ఏపీలో ఎక్కువగా నష్టపోయిన ప్రాంతం రాయలసీమ. వర్షాల నుంచి కోలుకుంటున్న రాయలసీమలోనూ మరో రెండు రోజులపాటు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకట్రెండు చోట్ల కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Also Read: Gold-Silver Price: స్థిరంగా బంగారం ధర.. రూ.100 తగ్గిన వెండి.. నేటి తాజా ధరలు ఇవీ..
తెలంగాణకు వర్ష సూచన..
నైరుతి బంగాళాఖాతం సమీపంలోని ఉత్తర శ్రీలంక తీరం నుంచి మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉన్న అల్పపీడన ద్రోణి ప్రభావం ఏపీతో పాటు తెలంగాణపై సైతం ఉంది. దీని ప్రభావంతో శుక్ర, శనివారాలలలో తెలంగాణలో కొన్ని జిల్లాల్లో తేలిక పాటి జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా పగటి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతాయని పేర్కొంది. కొన్ని జిల్లాల్లో మాత్రం వాతారణం పొడిగా ఉంటుందని అధికారులు తెలిపారు.
Also Read: Accident: నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొన్న లారీ.. వాగులో కొట్టుకుపోయిన ప్రయాణికులు