Weather Updates: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పొడి గాలులు తగ్గడంతో కనిష్ట ఉష్ణోగ్రత దిగొచ్చింది. పగటి పూట వేడి, ఉక్కపోత ఉన్నా, సోమవారం రాత్రి చలి మళ్లీ పెరిగింది. కొన్ని చోట్ల కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీలు నమోదైంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఏపీలో మరికొన్ని రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుంది.
ఆగ్రేయ గాలులు ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో వీచడంతో వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వేడి గాలులు కాస్త తగ్గాయి. పగటి ఉష్ణోగ్రతలు కొన్నిచోట్ల 36 డిగ్రీలు నమోదు కాగా, రాత్రి ఉష్ణోగ్రతలు అందులో సగం కూడా లేవు. మత్స్యాకారులకు వేటకు వెళ్లేందుకు ఎలాంటి ఆంక్షలు లేవని వెదర్ అప్‌డేట్‌లో పేర్కొన్నారు. అత్యల్పంగా కళింగపట్నంలో 15.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. జంగమేశ్వరపురంలో 17.2 డిగ్రీలు, బాపట్లలో 18.3 డిగ్రీలు, నందిగామలో 17.9 డిగ్రీలు, అమరావతిలో 18.4 డిగ్రీలు, తునిలో 18.7 డిగ్రీలు, విశాఖపట్నంలో 17.8 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
రాయలసీమలో ఉదయం వేడి.. రాత్రి చలి
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో పగటి పూట అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఇక్కడ సైతం రాత్రిపూట చలి మళ్లీ పెరిగింది. కొన్ని రోజుల కిందటి వరకు చలికి గజగజ వణికిన ఆరోగ్యవరంలో 16 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. అనంతపురంలో 18.3 డిగ్రీలు, కర్నూలులో 17.9 డిగ్రీలు నంద్యాలలో 17.2 డిగ్రీలు, తిరుపతిలో 19 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైంది.
తెలంగాణ వెదర్ అప్‌డేట్..
తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ నుంచి గంటలకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. భద్రాచలంలో, ఆదిలాబాద్‌లో, హైదరాబాద్‌లో 30 డిగ్రీలకు పైగా పగతి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
Also Read: Gold-Silver Price: బంగారం ధర భారీ షాక్! ఇలాగైతే అస్సలు కొనలేం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావమే