AP Investments Politics:   ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు రోజుల పాటు ఘనంగా పెట్టుబడుల సదస్సును నిర్వహించింది. రెండు రోజులకు కలిపి పదమూడున్నర లక్షల కోట్లకుపైగా ఎంవోయూలూ చేసుకున్నట్లగా ప్రకటించింది. రంగాల వారీగా ఆ జాబితా విడుదల చేసింది. అయితే పెట్టుబడుల సదస్సుపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఉన్న వాళ్లు.. జగన్ ద్వారా లబ్ది పొందిన వారు తప్ప ఇతర పెట్టుబడిదారులు ఎవరూ రాలేదని అంటున్నారు. అదే సమయంలో మొత్తం పెట్టుబడుల్లో 9.5 లక్షల కోట్లుకుపైగా గ్రీన్ ఎనర్జీ రంగంలోనే ఎంవోయూలు కావడంతో  దీని వెనుక స్కాం ఉందని ఆరోపణలు చేస్తున్నాయి. 


ఏపీ పెట్టుబడుల సదస్సు సక్సెస్సేనా ?


ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పది రోజుల కిందటే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను నిర్వహించింది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సదస్సును ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరిగిన   ఈ సమ్మిట్‌లో దాదాపుగా కేంద్రమంత్రులంతా పాల్గొన్నారు.  రెండు రోజుల సమ్మిట్‌లో యూపీకి పారిశ్రామిక వేత్తలకు మధ్య 32 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన 18వేల ఎంవోయూలు జరిగాయి. అక్కడ కూడా గ్రీన్ ఎనర్జీ రంగంలోనే ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు చేసుకున్నారు. అయితే అది పదిహేను శాతంలోపే ఉంది.  దాదాపుగా అన్ని రంగాల్లోనూ పెట్టుబడులు వచ్చాయి. గ్రీన్ ఎనర్జీలో ఎక్కువ. రిలయన్స్  ఏకంగా రూ. డెభ్బై వేల కోట్ల పెట్టుబడులను వ్చచే నాలుగేళ్లలో యూపీలో పెడతామని ప్రకటించారు. లక్ష ఉద్యోగాలిస్తామన్నారు. అయతే ఏపీలో మాత్రం ఎంవోయూలు జరిగాయని ప్రభత్వం ప్రకటించిన రూ. 13 లక్షల కోట్లలో రూ. 9.5 లక్షల కోట్లు గ్రీన్ ఎనర్జీ రంగంలోనే చేసుకున్నారు. 


భూముల సంతర్పణకే గ్రీన్ ఎనర్జీ పెట్టుబడుల పేరుతో ఎంవోయూలని విమర్శలు


సంప్రదాయేతర ఇంధన విద్యుత్ రంగంలోనే లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ రంగంలో ఉద్యోగాలు తక్కువ కానీ భూములు మాత్రం వేల ఎకరాల్లో కేటాయించాల్సి ఉంటుంది. ఇప్పటికే అదానీ, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వంటి సంస్థలకు కేటాయించిన భూములు వివాదాస్పదం అవుతున్నాయి. గ్రీన్ కో సంస్థపై ఎన్జీటీలో కేసులు వేశారు. ఇప్పుడు అదే గ్రీన్ ఎనర్జీలో కొత్తగా చాలా కంపెనీలు వచ్చాయి. వాటి మార్కెట్ క్యాపిటలైజేషన్ పదులు, వందల కోట్లలో ఉంటే.. పెట్టుబడులు మాత్రం వేల కోట్లలో పెడతామని ఎంవోయాలు చేసుకున్నారు. వీళ్లంతా  బీనామీలేనని లక్షల ఎకరాల భూములు కట్టబెట్టడానికే ఈ సమ్మిట్ నిర్వహించాలని రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుతో పాటు టీడీపీ నేతలు ఆరోపిస్తున్ారు. 


తయారీ , సేవా రంగాల దిగ్గజాలు సమ్మిట్‌కు ఎందుకు రాలేదు ?


సమ్మిట్‌కు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ వచ్చారు కనీ ఎలాంటి పెట్టుబడులు పెడతామని ఎంవోయూ చేసుకోలేదు. టాటా , బిర్లాలు, మహింద్రాలు రాలేదు. ఫార్మా రంగానికి సంబంధించి హెటెరో, అరబిందో ప్రతినిధులు ఎంవోయూలు చేసుకున్నారు. అయితే ఈ రెండు సంస్థలూ జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో ఉన్నాయని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి  కూడా పెద్దగా సహకారం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. యూపీ పెట్టుబడుల సదస్సును ప్రధాని ప్రారంభించారు కానీ  ఏపీకి వచ్చే సరికి పెట్టుబడుల సదస్సు ప్రారంభానికి కనీసం ఓ కేంద్ర మంత్రి రాలేదు. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో గడ్కరీ వచ్చినా మొక్కుబడిగా పాల్గొని.. మెడ్ టెక్ జోన్‌లో పర్యటించి వెళ్లిపోయారు. శనివారం కిషన్ రెడ్డి వచ్చి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని..తీరిక సమయంలో సమ్మిట్ కు వచ్చి ఏపీకి సహకరిస్తామని చెప్పారు. 


ఏడాదిలో కనీసం ఎంవోయూల్లో పది శాతం గ్రౌండ్ అయినా ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుంది ! 


ఎంవోయూలపై విపక్షాల విమర్శలకు ప్రభుత్వ  పనితీరే సమాధానం అవుతుంది. ఏడాదిలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఏడాదిలోపు కనీసం పది శాతం ఎంవోయూలు అయినా గ్రౌండ్ అయితే...  ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుంది. లేకపోతే విమర్శలు ఎదుర్కోవాల్సి రావొచ్చు.