AP Latest News in Telugu: ఏపీకి ప్రత్యేక హోదా సహా విభజన చట్టంలోని హామీల అమలు, విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ ఆపడం, విశాఖ రైల్వే జోన్ లాంటి అంశాల కోసం అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని వీవీ లక్ష్మీ నారాయణ సూచించారు.


ఏపీ ప్రయోజనాలను సాధించుకొనేందుకు జై భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకుడు, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీ నారాయణ కీలక డిమాండ్లను తెరపైకి తెచ్చారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, విపక్ష నేత చంద్రబాబు నాయుడు ముందు ఈ డిమాండ్లను ఉంచారు. ఏపీకి ప్రత్యేక హోదా సహా విభజన చట్టంలోని హామీల అమలు, విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ ఆపడం, విశాఖ రైల్వే జోన్ లాంటి అంశాల కోసం అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని వీవీ లక్ష్మీ నారాయణ సూచించారు. ఆ అఖిలపక్షానికి నాయకత్వం వహించాలని సీఎం జగన్ కు సూచించారు.


అలాగే టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా లక్ష్మీ నారాయణ కీలక సూచనలు చేశారు. ఆయన బీజేపీతో పొత్తుకు రెడీ అవుతున్న వేళ లక్ష్మీ నారాయణ ఈ విషయం తెరపైకి తేవడం చర్చనీయాంశం అవుతోంది. రేపో మాపో టీడీపీ ఎన్డీఏలో చేరుతుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అయ్యే ముందు అమిత్ షా నుంచి కొన్ని హామీలు రాతపూర్వకంగా తీసుకోవాలని డిమాండ్ చేశారు.


‘‘నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కల్పించడం, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని హామీలను నెరవేర్చడం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రణాళిక ఉపసంహరణ, వైజాగ్ రైల్వే జోన్ కేటాయింపును హేతుబద్ధీకరించడం గురించి అమిత్ షా నుండి సీట్ల భాగస్వామ్యాన్ని, ఎన్డీఏతో పొత్తు ఖరారు చేయడానికి ముందు రాతపూర్వక హామీ తీసుకోవాలి. ఆ రాతపూర్వక హామీని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చూపించాలి’’






‘‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని హామీలను నెరవేర్చాలని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రణాళికను ఉపసంహరించుకోవాలని, వైజాగ్ రైల్వే జోన్ కేటాయింపు హేతుబద్ధీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ భారత ప్రధాని నరేంద్రమోదీ వద్దకు అఖిల పక్ష  బృందానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ నాయకత్వం వహించాలి. సీఏఏ బిల్లు ఆమోదం, రాష్ట్రపతి ఎన్నికలు, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, ఢిల్లీ సివిల్ సర్వెంట్స్ అపాయింట్‌మెంట్ బిల్లును ఆమోదించే సమయంలో ఈ సమస్యలను డిమాండ్ చేసే అవకాశాలు ఎందుకు జార విడుచుకున్నారో కూడా ఆయన ప్రజలకు స్పష్టం చేయాలి’’ అని వీవీ లక్ష్మీ నారాయణ ఎక్స్ లో వరుస పోస్టులు చేశారు.