Wide discussion in BRS about the political activities of Kalvakantla Kavitha : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవలి కాలంలో రాజకీయంగా దూకుడుగా కనిపిస్తున్నాయి. దాదాపుగా ప్రతీ రోజూ ఏదో ఓ కార్యక్రమం పేరుతో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆందోళనలు చేస్తున్నారు. సహజంగా కవిత చేస్తున్న కార్యక్రమాలన్నీ బీఆర్ఎస్ కార్యక్రమలే అనుకుంటారు. నిజానికి కవిత బీఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. సొంతంగా తెలంగాణ జాగృతి పేరు మీదనే ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా మహిళా రిజర్వేషన్ల అంశానికి సంబంధించి జీవో నెంబర్ 3 మీద చేయబోయే ధర్నాను కూడా జాగృతి పేరు మీదనే నిర్వహిస్తున్నారు.
తెలంగాణ జాగృతి పేరుతో జీవో నెంబర్ 3కి వ్యతిరేకంగా ధర్నా
జీవో నంబర్ 3కు వ్యతిరేకంగా శుక్రవారం ఇందిరాపార్క్ వద్ద భారత జాగృతి ధర్నా నిర్వహించనుంది. బీఆర్ఎస్ తో సంబంధం లేకుండా ఈ ఆందోళనను నిర్వహించనున్నారు. కల్వకుంట్ల కవిత.. బీఆర్ఎస్ పిలుపు మేరకు ఇచ్చిన కార్యక్రమాల్లో పాల్గొనకుండా కేవలం తన సంస్థ వేదికగా వేరే కార్యక్రమాలు నిర్వహిస్తుండటం రాజకీయవర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని గతంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కూడా భారత జాగృతి ఆధ్వర్యంలోనే చేపట్టారు. ఇందులో బీఆర్ఎస్, సీపీఐ,సీపీఎం నాయకులు పాల్గొన్నప్పటికీ కార్యక్రమం మాత్రం భారత జాగృతి ఆధ్వర్యంలోనే సాగింది.
బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో పాల్గొనని కవిత
బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పిలుపునిచ్చిన కార్యక్రమాలు చేయడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతిపై విమర్శలు వస్తున్న తరుణంలో బీఆర్ఎస్ చలో మేడిగడ్డ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు, ఇతర ముఖ్యనేతలంతా హాజరయ్యారు. ఈ ప్రోగ్రాంకు కవిత వెళ్లలేదు. ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ) బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు నిర్వహించింది. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళనల్లో పాలు పంచుకున్నారు. ఈ కార్యక్రమాల్లో ఎక్కడా కవిత కనిపించలేదు. ఇదే సమయంలో చిన జీయర్ స్వామితో భేటీ అయ్యారు.
కవిత సొంత ముద్ర కోసం ప్రయత్నిస్తున్నారా ?
అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం పెట్టాలన్న డిమాండ్ ను కూడా కవిత తెరపైకి తెచ్చారు. ఈ డిమాండ్ పూర్తిగా బీఆర్ఎస్‌కు సంబంధం లేకుండా.. తెలంగాణ జాగృతిపేరు మీదనే నిర్వహించారు. రౌండ్ టేబుల్ సమవేశాలు కూడా నిర్వహించారు. కవిత చేసే రాజకీయం జాగృతి పేరు మీదనే ఉంది. బీఆర్ఎస్ తో సంబంధం లేదన్నట్లగా ఆమె చేస్తున్న రాజకీయం.. ఏదో తేడా ఉందన్న విషయం హాట్ టాపిక్ గా మారింది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేసే అవకాశం లేదని ఇప్పటికే క్లారిటీ వచ్చింది.